సొంత జట్టులో చేరిన కోహ్లీ
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడనున్నాడు.
By Medi Samrat Published on 28 Jan 2025 2:30 PM IST
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ మంగళవారం ఢిల్లీ జట్టులో చేరి శిక్షణ ప్రారంభించాడు. గత కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న 36 ఏళ్ల కోహ్లీ.. జనవరి 30 నుంచి రైల్వేస్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్‌ను ఆడనున్నాడు. కోహ్లీ తన చివరి రంజీ మ్యాచ్‌ను 2012లో ఉత్తరప్రదేశ్‌తో ఘజియాబాద్‌లో ఆడాడు.
మంగళవారం ఉదయం 9 గంటలకు అరుణ్ జైట్లీ స్టేడియానికి చేరుకున్న కోహ్లీ జట్టుతో సమావేశమైన తర్వాత.. సుమారు 15 నిమిషాల పాటు సహచరులతో కలిసి ఫుట్‌బాల్ ఆడాడు. స్టార్ ప్లేయర్ కోహ్లీ తన కొత్త సహచరులతో సౌకర్యవంతంగా కనిపించాడు. దాదాపు ఢిల్లీ ఆటగాళ్లందరూ తొలిసారిగా కోహ్లీతో డ్రెస్సింగ్ రూమ్‌ను షేర్ చేసుకోనున్నారు. ఢిల్లీ ప్రధాన కోచ్ శరణ్‌దీప్ సింగ్ నేతృత్వంలో ప్రాక్టీస్ సెషన్ జరిగింది.
డీడీసీఏ సెక్రటరీ అశోక్ శర్మ మాట్లాడుతూ.. 'విరాట్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అవకాశం మా జూనియర్ ఆటగాళ్లకు గొప్ప అనుభవం అవుతుంది. మా జట్టును పరిశీలిస్తే.. నవదీప్ సైనీ మాత్రమే ఐపీఎల్‌లో విరాట్‌తో పాటు భారత్ తరఫున ఆడాడు. రంజీ ట్రోఫీలో విరాట్‌తో కలిసి ఆడిన అనుభవం ఈ జట్టులో మరే ఆటగాడికి లేదు. అతడిని చూసి యువ ఆటగాళ్లు చాలా నేర్చుకోవచ్చు అని అన్నారు.
మ్యాచ్ ఏర్పాట్లపై శర్మను ప్రశ్నించగా.. 'విరాట్ ఉండటంతో మ్యాచ్‌కు ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతుందని మాకు తెలుసు. సాధారణ రంజీ మ్యాచ్‌కి 10 నుంచి 12 మంది వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ.. విరాట్ ప్రాక్టీస్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా భద్రతను మాత్రం కచ్చితంగా పెంచుతాం. 'మ్యాచ్ గురించి ఢిల్లీ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాం' అని చెప్పాడు.
ఢిల్లీ జట్టు:
ఆయుష్ బదోని (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ప్రణవ్ రాజ్‌వంశీ (వికెట్ కీపర్), సనత్ సాంగ్వాన్, అర్పిత్ రాణా, మయాంక్ గుసేన్, శివమ్ శర్మ, సుమిత్ మాథుర్, వంశ్ బేడి (వికెట్ కీపర్), మణి గ్రేవాల్, హర్ష్ త్యాగి, సిద్ధాంత్ శర్మ, నవదీప్ సైనీ , యష్ ధుల్, గగన్ వాట్స్, జాంటీ సిద్ధూ, హిమ్మత్ సింగ్, వైభవ్ కంద్పాల్, రాహుల్ గెహ్లాట్, జితేష్ సింగ్.