మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గవ టెస్టులో సామ్ కాన్స్టాస్‌తో వాగ్వాదానికి దిగినందుకు విరాట్ కోహ్లీకి అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. డిసెంబర్ 26, గురువారం బాక్సింగ్ డే టెస్ట్ మొదటి సెషన్‌లో కోహ్లీ ఆస్ట్రేలియా అరంగేట్ర ఆటగాడు సామ్ కాన్స్టాస్ ను ఢీకొట్టాడు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌తో విరాట్ కోహ్లి సమావేశం కేవలం 10 నిమిషాలు మాత్రమే కొనసాగింది. భారత మాజీ కెప్టెన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడాన్ని అంగీకరించాడు. లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు. బాక్సింగ్ డే రోజున మైదానంలో ఇలా ప్రవర్తించినందుకు కోహ్లీకి కేవలం ఒక డీమెరిట్ పాయింట్ మాత్రమే లభించింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 10-11వ ఓవర్ల మధ్య విరామం సమయంలో, కోన్‌స్టాస్, ఉస్మాన్ ఖవాజా క్రీజ్ మారుతుండగా కోహ్లి యువ బ్యాటర్ వైపు వెళ్లి అతనిని ఢీకొన్నాడు.
19 ఏళ్ల యువకుడితో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టిన నేపథ్యంలో విరాట్ కోహ్లీపై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారని విస్తృతంగా ఊహాగానాలు వచ్చాయి. ఉద్దేశపూర్వక శారీరక సంబంధం తరచుగా లెవల్ 2 నేరంగా వర్గీకరిస్తారు. ఇది మూడు లేదా నాలుగు డీమెరిట్ పాయింట్లకు దారి తీస్తుంది. ఒక ఆటగాడు 24-నెలల చక్రంలో నాలుగు డీమెరిట్ పాయింట్లను పొందినట్లయితే, అతను ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొంటాడు.