విరాట్ భావోద్వేగ ట్వీట్‌.. 7+18 అంటూ

Virat Kohli Drops A Heart Emoji For MS Dhoni In Viral Post.త‌న కెరీర్‌లోనే టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యంత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Aug 2022 7:13 AM GMT
విరాట్ భావోద్వేగ ట్వీట్‌.. 7+18 అంటూ

త‌న కెరీర్‌లోనే టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యంత గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాడు. తిరిగి మున‌ప‌టి ల‌య‌ను అందుకునేందుకు చాలా ప్ర‌య‌త్నిస్తున్నాడు. వెస్టిండీస్‌, జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌ల నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ నూత‌న ఉత్సాహంతో ఆసియా క‌ప్ 2022 టోర్నీ కోసం సిద్దం అవుతున్నాడు. ఈ టోర్నీతోనైనా విరాట్ ఫామ్ అందుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. ధోనిపై త‌న‌కున్న అనుబంధాన్ని మ‌రోసారి గుర్తు చేసుకున్నాడు విరాట్‌. ధోనితో క‌లిసి బ్యాటింగ్ చేసిన ఫోటోను షేర్ చేశాడు. ధోని నాయ‌క‌త్వంలో ఆడిన రోజుల‌ను గుర్తుకు తెచ్చుకున్నాడు. త‌న జీవితంలో అవే అత్యుత్త‌మంగా ఎంజాయ్ చేసిన రోజులుగా చెప్పుకొచ్చాడు. "ఈ వ్య‌క్తికి డిప్యూటీగా ఉన్న స‌మ‌యం.. నా కెరీర్‌లోనే ఎంతో ఆస్వాదించిన, ఉత్తేజ‌క‌ర‌మైన రోజులు. మా భాగ‌స్వామ్యాలు నాకు ఎన్న‌టికీ ప్ర‌త్యేక‌మైన‌వే. 7+18 "అని హార్ట్ సింబ‌ల్ తో ట్వీట్ చేశాడు కోహ్లీ.

ఇక్కడ 7 అనేది ధోని జెర్సీ నెంబ‌ర్ కాగా.. 18 విరాట్ జెర్సీ నెంబ‌ర్‌. ఈ రెండు కలిసి వచ్చేలా 25న‌ ఈ మేరకు కోహ్లి తమ అనుబంధం గురించి ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. కాగా.. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

ఇటీవ‌లే కోహ్లీ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి 14 ఏళ్లు పూర్తి అయిన సంగ‌తి తెలిసిందే. అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 70 శ‌త‌కాలు బాది ప‌రుగుల యంత్రంగా క్రికెట్ ప్ర‌పంచంలో పేరు తెచ్చుకున్నాడు. అయితే.. గ‌త మూడేళ్లుగా కోహ్లీ కి క‌లిసి రావ‌డం లేదు. అత‌డు శ‌త‌కం చేసి వెయ్యి రోజులు దాటి పోయింది. ఈ క్ర‌మంలో ఈ నెల 28న పాకిస్తాన్‌తో జ‌రిగే మ్యాచ్‌లోనైనా కోహ్లీ శ‌త‌క దాహాన్నితీర్చుకోవాల‌ని అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.

Next Story