రిటైర్మెంట్ తర్వాత ఏం చేయ‌నున్నాడో చెప్పిన‌ కోహ్లీ..!

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ క్రికెట్‌లో తన భవిష్యత్తు గురించి శనివారం మాట్లాడాడు.

By Medi Samrat  Published on  15 March 2025 8:29 PM IST
రిటైర్మెంట్ తర్వాత ఏం చేయ‌నున్నాడో చెప్పిన‌ కోహ్లీ..!

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ క్రికెట్‌లో తన భవిష్యత్తు గురించి శనివారం మాట్లాడాడు. బహుశా మరో ఆస్ట్రేలియా టూర్ చేసే సత్తా తనకు లేదేమో అని కోహ్లీ అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025కి ముందు బెంగళూరు చేరుకున్న తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇన్నోవేషన్ ల్యాబ్‌లో కోహ్లీ ఈ విషయాన్ని వెల్లడించాడు. IPL 2025 మార్చి 22 నుండి ప్రారంభమవుతుంది.

ఆస్ట్రేలియా గడ్డపై తన ఇటీవలి పోరాటాలను ప్రతిబింబించేలా కోహ్లీ ఇలా అన్నాడు.. "బహుశా నాకు మరొక ఆస్ట్రేలియా పర్యటన చేసే సామర్థ్యం లేదు.. కాబట్టి గతంలో ఏమి జరిగినా.. నేను దానితో సంతృప్తి చెందానని పేర్కొన్నాడు. కోహ్లీ ప్రకటన తర్వాత.. విరాట్ కోహ్లీ రానున్న కాలంలో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడనే ఊహాగానాలు మొదలయ్యాయి.

రిటైర్మెంట్ తర్వాత తన ప్రణాళికల గురించి కూడా కోహ్లీ చెప్పాడు. రిటైర్మెంట్ తర్వాత నేను ఏం చేస్తానో నాకు నిజంగా తెలియదు' అని కోహ్లీ అంగీకరించాడు. "ఇటీవల నేను ఒక సహచరుడిని ఇదే ప్రశ్న అడిగాను.. అదే సమాధానం వచ్చింది.. కానీ రిటైర్మెంట్ తర్వాత బహుశా చాలా ప్రయాణం ఉంటుంద‌ని పేర్కొన్నాడు.

దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం సాధించినందుకు విరాట్ కోహ్లీ గర్వంగా ఉన్నాడు. జట్టుగా మనం పరిస్థితులకు అనుగుణంగా మ‌న‌ల్ని మ‌నం మలచుకున్నాం. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నాం' అని కోహ్లీ చెప్పాడు. భారత్‌లో మహిళల క్రికెట్ భవిష్యత్తు, ముఖ్యంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)పై కూడా కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. "డబ్ల్యుపీఎల్ పెరుగుతోంది.. క్రీడా దేశంగా ఎదగాలనుకుంటే.. పురుషుల ఆటపై మాత్రమే దృష్టి పెడితే స‌రిపోదు" అని అతను చెప్పాడు.

2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చిన నేపథ్యంలో భారత్‌కు పతకం సాధించే అవకాశాలపై కోహ్లీ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. ఒలింపిక్స్ (2028)లో క్రికెట్ భాగం కావడం మాకు గొప్ప అవకాశం అని, పతకంతో తిరిగి రావడం జట్టుకు పెద్ద విషయమని అన్నాడు.

Next Story