విరాట్ కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం నాడు అడిలైడ్‌లో భారత్ బంగ్లాదేశ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వ్యక్తిగత స్కోరు 16కి చేరుకున్నప్పుడు ICC T20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 31 ఇన్నింగ్స్‌ల్లో 1016 పరుగులు చేసిన శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే రికార్డును అతను అధిగమించాడు. టోర్నీ చరిత్రలో కోహ్లి తన 25వ ఇన్నింగ్స్ ఆడాడు. ఐసిసి టి20 ప్రపంచకప్ 2014, 2016 ఎడిషన్లలో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. 2014లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే, కోహ్లీ 319 పరుగులతో భారత్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు, అక్కడ భారత్ శ్రీలంక చేతిలో ఓడిపోయింది.
బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 64 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో కోహ్లీకి ఇది మూడవ అర్ధ సెంచరీ. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. అతను 32 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 50 రన్స్ చేసి ఔటయ్యాడు. సూర్య కుమార్ కేవలం 16 బంతుల్లో 4 ఫోర్లతో 30 రన్స్ చేశాడు. చివర్లో అశ్విన్ ఆరు బంతుల్లో 13 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 184 రన్స్ చేసింది.