వారిద్దరు విఫలమయ్యారు.. వీరిద్దరు ఫీలయ్యారు..!
మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఐదో, చివరి రోజు మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 30 Dec 2024 9:33 AM ISTమెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఐదో, చివరి రోజు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ 234 పరుగులకే పరిమితం కావడంతో భారత జట్టు 340 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగింది.
MCGలో మ్యాచ్‌ని చూడటానికి 3 లక్షల 50 వేల మందికి పైగా ప్రేక్షకులు రాగా.. ఆ ప్రేక్షకులలో బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా ఉన్నారు, ఆమె భర్త విరాట్ కోహ్లీకి మద్దతుగా రాగా.. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఐదవ రోజు స్టేడియంలో కనిపించింది. ఆమెను చూడగానే అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే.. విరాట్ కోహ్లీ ఔట్ కాగానే అనుష్కతో పాటు అభిమానులంతా గుండెలు బాదుకున్నారు. కోహ్లి అవుట్ అయినప్పుడు అనుష్క చాలా నిరాశకు గురైనట్లు వైరల్ చిత్రాలలో కనిపిస్తుంది.
భారత జట్టు పేలవమైన ఆరంభాన్ని చూసి అనుష్క శర్మ చాలా టెన్షన్‌లో కనిపించింది. అనుష్క, కెఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి కలిసి స్టాండ్స్‌లో కూర్చున్నారు. విరాట్ కోహ్లీ కేవలం 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అవుటగా.. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. విరాట్ అవుటైన సమయంలో అనుష్క శర్మ, అతియా శెట్టి చాలా నిరాశగా కనిపించారు. అనుష్క నుదిటిపై చేయి వేసుకుని బాధపడుతూ కనిపించగా, కేఎల్ రాహుల్ డకౌట్ అయిన తర్వాత అతియా శెట్టి కూడా నిరాశతో కనిపించింది. ఇద్దరూ విఫలమవడంతో అనుష్క-అతియా నిశ్శబ్దంగా కూర్చొని కనిపించారు.
మెల్‌బోర్న్ టెస్టులో విరాట్ కోహ్లీ మరోసారి బ్యాట్‌తో ఫ్లాప్ అయ్యాడు. రోహిత్ శర్మ, రాహుల్‌ల తొలి వికెట్ల తర్వాత, కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడతాడని అందరూ ఊహించారు, కానీ కోహ్లి మళ్లీ విఫలమై పెవిలియన్‌కు చేరుకున్నాడు. మిచెల్ స్టార్క్ ఆఫ్ స్టంప్ వెలుపల వేసిన బంతిపై కోహ్లీ కవర్స్ వైపు ఆడాడు.. కానీ బంతి బ్యాట్ వెలుపలి అంచుని తాకి నేరుగా స్లిప్స్‌లో ఖవాజా వద్దకు వెళ్లింది.
మెల్‌బోర్న్ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. అంతకుముందు గబ్బా టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 18 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రమే అజేయ సెంచరీ చేశాడు.