మాట నిల‌బెట్టుకున్నాడు.. కాంబ్లీకి జీవితకాలం ఆర్థిక సహాయం ప్రకటించిన గవాస్కర్

భారత క్రికెట్‌కు సంబంధించి చాలా భావోద్వేగ, స్ఫూర్తిదాయకమైన వార్త వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat
Published on : 15 April 2025 8:44 PM IST

మాట నిల‌బెట్టుకున్నాడు.. కాంబ్లీకి జీవితకాలం ఆర్థిక సహాయం ప్రకటించిన గవాస్కర్

భారత క్రికెట్‌కు సంబంధించి చాలా భావోద్వేగ, స్ఫూర్తిదాయకమైన వార్త వెలుగులోకి వచ్చింది. గత కొంత కాలంగా ఆరోగ్యం, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ వినోద్ కాంబ్లీకి సాయం చేసేందుకు పాత సహచరుడు, భారత వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ దేవదూతలా ముందుకు వచ్చాడు.

గవాస్కర్ కొంతకాలం క్రితం కాంబ్లీకి సహాయం చేస్తానని వాగ్దానం చేసాడు. ఇప్పుడు ఆయ‌న‌ ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు సిద్ధ‌మ‌య్యాడు. గవాస్కర్ CHAMPS ఫౌండేషన్ వినోద్ కాంబ్లీకి జీవితాంతం ప్రతి నెలా ₹ 30,000 ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. తద్వారా ఆ డ‌బ్బుల‌తో ఆయ‌న ఆరోగ్యాన్ని బాగా చూసుకోవచ్చు అని అభిప్రాయ‌ప‌డింది.

సునీల్ గవాస్కర్ 1999లో చాంప్స్ ఫౌండేషన్‌ని ప్రారంభించి నిరుపేద ఆటగాళ్లకు సహాయం చేశాడు. ఈ ఫౌండేషన్ ఏప్రిల్ 1, 2025 నుండి కాంబ్లీకి ఈ మొత్తాన్ని అందించడం ప్రారంభించింది. ఇది కాకుండా కాంబ్లీ ఆరోగ్య సంబంధిత ఖర్చుల కోసం సంవత్సరానికి అదనంగా ₹ 30,000 ఇవ్వనుంది. వాంఖడే స్టేడియం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల గవాస్కర్, కాంబ్లీల మధ్య సమావేశం జరగడం గమనార్హం. కాంబ్లీ ఎమోషనల్‌గా గవాస్కర్ పాదాలను తాకిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

గత ఏడాది డిసెంబర్‌లో యూరిన్ ఇన్ఫెక్షన్ కారణంగా వినోద్ కాంబ్లీ రెండు నెలల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. ఈ విషయం గవాస్కర్‌కు తెలిసిన వెంటనే తనకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు కాంబ్లీకి చికిత్స అందిస్తున్న వైద్యుడు శైలేష్ ఠాకూర్ తెలిపారు. కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక చిహ్న ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా సరిగ్గా నిలబడలేని స్థితిలో కాంబ్లీ పరిస్థితి నెలకొంది. అటువంటి పరిస్థితిలో గవాస్కర్ తీసుకున్న చొరవ కేవలం సహాయం మాత్రమే కాదు, మానవత్వానికి ఉదాహరణగా చెబుతున్నారు.

Next Story