కాంబ్లీకి జాబ్ ఆఫ‌ర్‌.. జీతం ఎంతంటే..!

Vinod Kambli got a new job offer. భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న విష‌యం తెలిసిందే.

By Medi Samrat  Published on  23 Aug 2022 3:30 PM GMT
కాంబ్లీకి జాబ్ ఆఫ‌ర్‌.. జీతం ఎంతంటే..!

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న విష‌యం తెలిసిందే. కాంబ్లీ పని కోసం చూస్తున్నాడు. ఈ క్ర‌మంలో త‌న‌ ఆర్థిక సంక్షోభం గురించి ఆయనే స్వయంగా బ‌య‌టికి చెప్పారు. ఈ క్ర‌మంలోనే కాంబ్లీకి జాబ్ ఆఫర్ వచ్చింది. మహారాష్ట్రకు చెందిన సందీప్ థోరట్ అనే వ్యాపారవేత్త తన కంపెనీలో చేరాలని కాంబ్లీని కోరాడు. కాంబ్లీకి సందీప్ థోరట్ కంపెనీ సహ్యాద్రి ఉద్యోగ్ గ్రూప్‌లో ఫైనాన్స్ విభాగంలో పని క‌ల్పించ‌నున్న‌ట్లు పేర్కొన్నాడు.

కాంబ్లీకి నెలకు లక్ష రూపాయల జీతం ఇవ్వనున్న‌ట్లు కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్‌పై కాంబ్లీ ఇంకా స్పందించలేదు. కాంబ్లీ ప్ర‌స్తుతం బీసీసీఐ ఇస్తున్న పింఛ‌న్ తో జీవిస్తున్నాడు. కాంబ్లీ ముంబై క్రికెట్ అసోసియేషన్ నుండి కూడా పని కోరాడు. త్వరలో అతనికి కొంత పని లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

కాంబ్లీ ఒకప్పుడు సచిన్ కంటే గొప్ప బ్యాట్స్‌మెన్‌గా పరిగణించబడ్డాడు. దేశవాళీ క్రికెట్‌లో అతని గణాంకాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి, అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో అతని కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇప్పుడు అతను త‌న‌ అవసరాలను తీర్చుకోవ‌డానికి చాలా కష్టపడుతున్నాడు.

వినోద్ కాంబ్లీ బీసీసీఐ నుండి ప్రతి నెలా 30 వేల రూపాయల పెన్షన్ పొందుతాడు. దీని ద్వారా అతని జీవితం కొనసాగుతోంది, అయితే ముంబై వంటి నగరంలో ఆ డబ్బుతో జీవించడం అంత సులభం కాదు. దీంతో కాంబ్లీ పని కోసం వెతుకుతున్నాడు. 2022 డేటా ప్రకారం.. కాంబ్లీ వార్షిక ఆదాయం కేవలం నాలుగు లక్షల రూపాయలు. కాంబ్లీకి ముంబైలో సొంత ఇల్లు ఉన్నప్పటికీ.. ఇతర ఖర్చులతో ప్రతినెలా రూ.30 వేలతో బతకడం కష్టం.

వినోద్ కాంబ్లీ భారత్ తరఫున మొత్తం 104 వన్డేలు, 17 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను మొత్తం 3,561 పరుగులు చేశాడు. ఇందులో మొత్తం ఆరు సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో నాలుగు సెంచరీలు, వన్డే క్రికెట్‌లో రెండు సెంచరీలు చేశాడు. 1991లో కెరీర్ ప్రారంభించిన కాంబ్లీ కేవలం తొమ్మిదేళ్లకే కెరీర్ ముగించాడు. కాంబ్లీ తన చివరి మ్యాచ్‌ను 2000లో ఆడాడు, అతని భాగస్వామి సచిన్ 24 సంవత్సరాలు దేశం కోసం ఆడి అనేక రికార్డులు సృష్టించాడు.



Next Story