ఆసియా క్రీడలకు ముందు భారత్‌కు గ‌ట్టి షాక్‌..!

మోకాలి గాయం కారణంగా ఇండియ‌న్‌ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆసియా క్రీడలు-2023 నుంచి వైదొలిగింది

By Medi Samrat  Published on  15 Aug 2023 10:36 AM GMT
ఆసియా క్రీడలకు ముందు భారత్‌కు గ‌ట్టి షాక్‌..!

మోకాలి గాయం కారణంగా ఇండియ‌న్‌ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆసియా క్రీడలు-2023 నుంచి వైదొలిగింది. ఈ విషయాన్ని ఫోగట్ మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆగస్టు 17న ఆమెకు శస్త్రచికిత్స జరగనుంది. "కొన్ని రోజుల క్రితం శిక్షణ సమయంలో నా మోకాలికి గాయమైంది. స్కానింగ్ తర్వాత వైద్యులు నాకు శస్త్రచికిత్స చేయాల‌ని చెప్పారు. ఆగస్టు 17న ముంబైలో నాకు శస్త్రచికిత్స చేస్తారు" అని ఆమె తెలిపింది.

“నాకు ఆగస్టు 17న ముంబైలో శస్త్రచికిత్స జరుగుతుంది. 2018లో జకార్తాలో నేను సాధించిన ఆసియా క్రీడల బంగారు పతకాన్ని నిలబెట్టుకోవడం నా కల. కానీ దురదృష్టవశాత్తు ఈ గాయంతో వెళ్ల‌లేక‌పోతున్నాను. రిజర్వ్ ప్లేయర్‌ను ఆసియా క్రీడలకు పంపేందుకు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాను. అభిమానులందరూ నాకు మద్దతు ఇవ్వడం కొనసాగించాలని అభ్యర్థిస్తున్నాను. తద్వారా నేను త్వరలో బలమైన పునరాగమనం చేయగలను. పారిస్ 2024 ఒలింపిక్స్‌కు సిద్ధమవుతాను. మీ మద్దతు నాకు అపారమైన శక్తిని ఇస్తుంది" అని వినేష్ ఫోగట్ తన ట్వీట్‌లో రాసింది.

వినేష్, బజరంగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడంపై ధృవీకరించలేదు. సెప్టెంబర్ 16న ప్రారంభమయ్యే ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలు 2024 పారిస్ ఒలింపిక్స్‌కు మొదటి క్వాలిఫైయింగ్ ఈవెంట్.

Next Story