రెజ్లింగ్‌లో సెమీ ఫైనల్ చేరిన వినేష్ ఫోగట్
పారిస్ ఒలింపిక్స్ 2024 11వ రోజు భారత్‌కు మంచి ఫలితాలే వెలువడుతున్నాయి.
By Medi Samrat Published on 6 Aug 2024 11:24 AM GMTపారిస్ ఒలింపిక్స్ 2024 11వ రోజు భారత్‌కు మంచి ఫలితాలే వెలువడుతున్నాయి. నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో ఫైనల్‌కు అర్హత సాధించగా.. మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి వినేష్ ఫోగట్ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. వినేష్ ఉక్రెయిన్ క్రీడాకారిణిని 7–5తో ఓడించింది. ఈరోజు రాత్రి 10:15 గంటలకు సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
అంతకుముందు ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌లో వినేష్ ఫోగట్ 3-2తో ప్రపంచ నంబర్ వన్, 2020 టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ జపాన్‌కు చెందిన యుయి సుసాకిని ఓడించి క్వార్టర్స్‌కు చేరుకుంది. వినేష్‌కి ఇది తొలి మ్యాచ్.. అందులో ఆమె అద్భుత ప్రదర్శన చేసింది.
తొలి మ్యాచ్ గెలిచిన తర్వాత వినేష్ భావోద్వేగానికి గురైంది. తొలుత వినేష్ 0-2తో వెనుకంజలో ఉండగా.. చివరి 15 సెకన్లలో వినేష్ జపాన్ రెజ్లర్‌ను ఓడించి మూడు పాయింట్లు సాధించింది.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్‌లో ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా వినేష్ మహిళల 50 కేజీల విభాగంలో పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. ఆమె సెమీఫైనల్‌లో లారా గనికిజీని ఓడించింది. వినేష్ రియో 2016, టోక్యో 2020 ఒలంపిక్స్ రెండింటిలోనూ క్వార్టర్ ఫైనల్స్‌లో నిష్క్రమించింది.