'మా అందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం అక్కా'.. వినేష్‌కు ధైర్యం చెప్పిన మణికా బాత్రా
భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ బాధను యావత్ దేశం అర్థం చేసుకుంటోంది.
By Medi Samrat Published on 15 Aug 2024 2:45 PM GMTభారత స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ బాధను యావత్ దేశం అర్థం చేసుకుంటోంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ పోటీలో వినేష్ ఫోగట్ ఫైనల్ బౌట్‌కు ముందు అనర్హత వేటుకు గురైంది. ఫైనల్ బౌట్ రోజు వినేష్ ఫోగట్ బరువు 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత వినేష్ ఫోగట్ రజత పతకం ఇవ్వాలంటూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ని ఆశ్రయించింది. అయితే ఆమె అప్పీల్ బుధవారం తిరస్కరించబడింది. ఈ నిర్ణయం తర్వాత వినేష్ ఫోగట్‌తో సహా భారత అభిమానులు మరోసారి షాక్‌కు గురయ్యారు.
వినేష్ ఫోగట్ బంగారు పతకానికి బలమైన పోటీదారు అని అంతా భావించారు. అయితే ఆమె పతకం గెలవకుండా నిరాశతో దేశానికి తిరిగి వచ్చింది. తనపై అనర్హత వేటు వేయడంతో వినేష్ ఎంతగానో కుంగిపోయి.. గత వారం రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ కూడా ప్రకటించింది.
2024 ఒలింపిక్స్‌లో రజత పతకం రాలేదన్న బాధను వినేష్ ఫోగట్ గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ద్వారా పంచుకున్నారు. వినేష్ ఫోగట్ ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోస్టులో ఎంత కష్టపడినా వినేష్ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేదని ఈ పాట లిరిక్స్ తెలియజేస్తుంది.
వినేష్ ఫోగట్ పోస్ట్‌పై ఎలాంటి క్యాప్షన్ రాయలేదు. వినేష్ ఫోగట్ పోస్ట్‌పై బాలీవుడ్ నటి హుమా ఖురేషి వెంటనే స్పందించింది. హుమా ఖురేషి "మీరు మా పవిత్రమైన గోల్డ్ ఛాంపియన్" అని రాశారు, హుమా ఖురేషి వ్యాఖ్యను అభిమానులు ఎంతో అభినందిస్తున్నారు.
భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మణికా బాత్రా కూడా ‘‘మా అందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం అక్కా’’ అని వ్యాఖ్యానించింది. మీరు భారతదేశపు రత్నం. మీ అంకితభావం, శక్తి చాలా మందికి వెలుగునిచ్చింది. కలలను అభిరుచితో, మెరుగైన మార్గంలో ఎలా కొనసాగించాలో మీరు మాకు చూపించారు. మీ ప్రయాణాన్ని చూసినందుకు మేము అదృష్టవంతులం అని పేర్కొంది.
వినేష్ ఫోగట్ విజ్ఞప్తిని తిరస్కరించడంపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష ఆశ్చర్యం వ్యక్తం చేశారు. CAS నిర్ణయంతో వినేష్ ఫోగట్ కుటుంబ సభ్యులు కూడా నిరాశ చెందారు.