అస‌లైన పోరాట యోధుడు హ‌నుమ విహారి.. మణికట్టుకు ఫ్రాక్చర్.. ఒంటి చేత్తో బ్యాటింగ్

Vihari bats with fractured wrist hits yorker for four with one hand.తెలుగు ఆట‌గాడు అయిన హ‌నుమ విహారి పై నెట్టింట‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Feb 2023 11:35 AM IST
అస‌లైన పోరాట యోధుడు హ‌నుమ విహారి.. మణికట్టుకు ఫ్రాక్చర్.. ఒంటి చేత్తో బ్యాటింగ్

హ‌నుమ విహారి.. ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. తెలుగు ఆట‌గాడు అయిన హ‌నుమ విహారి చేసిన ప‌నిపై ప్ర‌స్తుతం నెట్టింట‌ ప్ర‌శంస‌ల‌ వ‌ర్షం కురుస్తోంది. దేశం త‌రుపున ఆడేట‌ప్పుడే కాదు తాను ఆడే ప్ర‌తీ మ్యాచ్‌లో అంకితభావంతో ఆడ‌తానన‌ని మాట‌ల‌తో కాదు చేత‌ల‌తో చాటి చెప్పాడు. ఎడ‌మ చేతి మ‌ణిక‌ట్టు వ‌ద్ద గాయం అయిన‌ప్ప‌టికీ కీల‌కమైన మ్యాచ్ కావ‌డంతో నొప్పిని సైతం లెక్క‌చేయ‌కుండా జ‌ట్టు కోసం బ‌రిలోకి దిగాడు. జ‌ట్టుకు వీలైన‌న్ని ఎక్కువ ప‌రుగులు అందించాల‌నే ల‌క్ష్యంతో ఆడాడు ఈ ఆంధ్ర రంజీ జ‌ట్టు కెప్టెన్.

రంజీ క్వార్ట‌ర్స్‌లో భాగంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ జ‌ట్టుతో ఆంధ్ర జ‌ట్టు త‌ల‌ప‌డుతోంది. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట‌లో విహారి 16 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద బ్యాటింగ్ చేస్తుండ‌గా పేస‌ర్ ఆవేశ్ ఖాన్ విసిరిన బౌన్స‌ర్ త‌గిలి ఎడ‌మ చేతి మ‌ణిక‌ట్టు వ‌ద్ద గాయ‌మైంది. దీంతో విహారి రిటైర్డ్ హ‌ర్ట్‌గా వెనుదిరిగాడు. రెండు రోజు ఆంధ్ర జ‌ట్టు త్వ‌ర‌గా వికెట్లు కోల్పోయింది. 353 ప‌రుగుల‌కే 9 వికెట్లు కోల్పోయింది.

ఎడిచేతి మ‌ణిక‌ట్టులో చీలిక ఏర్ప‌డ‌డంతో విహారికి ఐదు నుంచి ఆరు వారాల విశ్రాంతి అవ‌స‌రం అని వైద్యులు సూచించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో విహారి బ్యాటింగ్‌కు రాడ‌ని అంతా బావించారు. అయితే.. విహారి మాత్రం జ‌ట్టుకు వీలైన‌న్ని ఎక్కువ ప‌రుగులు అందించాల‌నే ఉద్దేశ్యంతో ప‌ద‌కొండో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. స్వ‌త‌హాగా రైట్ హ్యాండ్ అయిన విహారి.. ఎడ‌మ చేతి గాయం వేధిస్తుండ‌డంతో, ఎడ‌మ‌చేతి వాటానికి మారి ఒక్క చేతితో(కుడి) బ్యాటింగ్ కొన‌సాగించాడు.

ఓ వైపు నొప్పి బాధిస్తున్న‌ప్ప‌టికీ 20కి పైగా బంతుల‌ను ఎదుర్కొన్న విహారి మ‌రో రెండు బౌండ‌రీలు బాదాడు. ముందురోజు స్కోరుకు మ‌రో 11 ప‌రుగులు జ‌త చేశాడు. చివ‌రికి ఎల్బీగా పెవిలియ‌న్‌కు చేరాడు. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 379 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో అత‌డిపై నెట్టింట ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

విహారి పోరాటంపై స‌హ‌చ‌ర ఆట‌గాడు, సీనియ‌ర్ స్పిన్న‌ర్ అయిన ర‌విచంద్ర‌న్ అశ్విన్ స్పందించాడు. విహారి అస‌లైన పోరాట యోధుడు అంటూ 2021లో ఆస్ట్రేలియా మ్యాచ్‌లో వారిద్ద‌రి ఫోటోను జోడించాడు.

2021లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో విహారి, అశ్విన్‌లు అద్భుతంగా పోరాడి మ్యాచ్‌ను డ్రా చేసిన సంగ‌తిని స‌గ‌టు క్రికెట్ అభిమాని ఎన్న‌టికి మ‌రువ‌లేరు. ఆ మ్యాచ్‌లో 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 272 పరుగులకే భారత జట్టు 5 వికెట్లు కోల్పోయింది. ఆ స‌మ‌యంలో విహారికి అశ్విన్ తోడు అయ్యారు. ఇద్ద‌రూ ఎంతో ఓపిక‌గా బ్యాటింగ్ చేశారు. ఆ మ్యాచ్‌లోనూ విహారి కాలి గాయంతో బాధ‌ప‌డుతూనే మ్యాచ్ ఆడాడు. అశ్విన్‌, విహారి జంట 42.3 ఓవ‌ర్ల పాటు ఆసీస్‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌కుండా మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. విహారి 161 బంతులు ఆడి 23 పరుగులు చేయగా అశ్విన్ 128 బంతుల్లో 39 పరుగులు చేశాడు.

Next Story