వేదిక పైకి పిలిచి మరీ.. యువ రెజ్ల‌ర్‌ను చెంప‌దెబ్బ‌లు కొట్టిన ఎంపీ.. వీడియో వైరల్

Video Shows BJP MP Slapping Wrestler On Stage At Sports Event. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్ ఈవెంట్‌లో బీజేపీ ఎంపీ ఒకరు రెజ్లర్‌ను చెంపదెబ్బ కొట్టడం కెమెరాకు చిక్కింది.

By అంజి  Published on  18 Dec 2021 2:27 PM IST
వేదిక పైకి పిలిచి మరీ.. యువ రెజ్ల‌ర్‌ను చెంప‌దెబ్బ‌లు కొట్టిన ఎంపీ.. వీడియో వైరల్

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు మరియు కైసర్‌గంజ్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ శుక్రవారం సహనం కోల్పోయి వేదికపై ఉన్న యువ రెజ్లర్‌ను చెంపదెబ్బ కొట్టారు. రాంచీలోని షహీద్ ఫాన్‌పత్ రాయ్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న అండర్-15 జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్ ఈవెంట్‌లో బీజేపీ ఎంపీ ఒకరు రెజ్లర్‌ను చెంపదెబ్బ కొట్టడం కెమెరాకు చిక్కింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కూడా అయిన బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్, యువ రెజ్లర్‌ను వేదికపై నుండి వెళ్లే ముందు రెండుసార్లు కొట్టడం వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

లోక్‌సభలో ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్.. రాంచీలోని షహీద్ గణపత్ రాయ్ ఇండోర్ స్టేడియంలో అండర్-15 జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ఈవెంట్‌లో మొదటి రోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా యువ రెజ్లర్‌ వయసు ఎక్కువగా ఉండటం కారణంగా పోటీలో పాల్గొనేందుకు అనుమతించబడలేదు. అయినప్పటికీ అతను తనను అండర్-15 ఈవెంట్‌లో పాల్గొనడానికి అనుమతించమని పట్టుబట్టాడు. కాగా యువ రెజ్లర్‌ను ఎంపీ వేదికపై పిలిచాడు.ఆ తర్వాత ఎంపీ తన నిగ్రహాన్ని కోల్పోయి యువ రెజ్లర్‌ను చెంపదెబ్బ కొట్టాడు. జార్ఖండ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు భోలానాథ్ సింగ్, అక్కడ ఉన్న ఇతర సభ్యులు వేదికపైకి చేరుకుని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిని శాంతింపజేశారు. వీడియో చూసిన నెటిజన్లు ఎంపీ తీరును విమర్శిస్తున్నారు. ఆయన అలా చేయకుండా రెజ్లర్‌కు నచ్చజెప్పితే బాగుండేదని నెటిజన్లు అంటున్నారు.

అండర్-15 జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్

అండర్-15 జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ బుధవారం జార్ఖండ్‌లోని రాంచీలో ప్రారంభమైంది. పోటీలో, గ్రీకో-రోమన్, ఫ్రీస్టైల్ విభాగాలలో రెజ్లింగ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మొదటి రోజు పోటీల్లో హర్యానా ఆరు స్వర్ణాలు, మహారాష్ట్ర మూడు బంగారు పతకాలు, ఆతిథ్య జార్ఖండ్ ఒక బంగారు పతకం సాధించాయి. రెండో రోజు ఢిల్లీ రెండు స్వర్ణాలు సాధించగా, మహారాష్ట్ర, హర్యానా చెరో రెండు స్వర్ణాలు కైవసం చేసుకున్నాయి. బుధవారం ఫ్రీస్టైల్ మహిళల రెజ్లింగ్ విభాగంలో లక్నోకు చెందిన చంచల కుమారి రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

Next Story