గత కొంత కాలంగా వెంకటేష్ అయ్యర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2023లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో చెలరేగి సెంచరీ సాధించాడు. దీంతో 15 ఏళ్ల తర్వాత కేకేఆర్ టీమ్ నుండి సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా కనిపించాడు. అతను గ్రౌండ్ అంతా స్ట్రోక్స్ కొట్టాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వెంకటేష్ అయ్యర్ తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. 51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అతనికి ఇదే తొలి సెంచరీ.
కేకేఆర్ టీమ్ తరుపున ఐపీఎల్ లో మొదటి సెంచరీ 2008 సంవత్సరంలో బ్రెండన్ మెకల్లమ్ సాధించాడు. అది ఐపీఎల్ చరిత్రలో మొదటి మ్యాచ్. మెకల్లమ్ 158 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అతని తర్వాత 15 ఏళ్లపాటు కేకేఆర్ తరఫున ఏ ఆటగాడు సెంచరీ చేయలేకపోయాడు. ఇప్పుడు ఐపీఎల్ 2023లో వెంకటేష్ అయ్యర్ సెంచరీ చేయడం ద్వారా.. 15 సంవత్సరాల తర్వాత చరిత్రను పునరావృతం చేశాడు. ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్ అయ్యర్.
వెంకటేష్ అయ్యర్ 2021 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. ఐపీఎల్ 2021లో 10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేశాడు. అతను ఒంటరిగా కేకేఆర్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అతను ఇప్పటివరకు 27 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 6 అర్ధ సెంచరీలతో 786 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 132.55. ఎలాంటి బౌలింగ్ అటాక్‌నైనా చిత్తు చేయగల సత్తా అతనికి ఉంది.