ఆయనో 'దిగ్గజం'.. ఆయనకో దిగ్గజం.. ఆ ఇంట విషాదం..!
1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడు, టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ తండ్రి వెస్ పేస్ 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
By Medi Samrat
1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడు, టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ తండ్రి వెస్ పేస్ 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మీడియా కథనాల ప్రకారం.. వెస్ పేస్ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం కోల్‌కతా నగరంలోని ఓ ఆసుపత్రిలో చేరారు.
వెస్ పేస్‌కు భారత క్రీడలతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన పర్యవేక్షణలో చాలా మంది క్రీడాకారులు వివిధ క్రీడలలో అరంగేట్రం చేసే అవకాశం పొందారు. భారత క్రీడల కోసం వెస్ చాలా కృషి చేశారు. ఆయన భారత హాకీ జట్టులో మిడ్‌ఫీల్డర్‌గా ఆడేవారు. ఇది కాకుండా.. ఆయన ఫుట్‌బాల్, క్రికెట్, రగ్బీ వంటి అనేక క్రీడలకు కూడా తన సహకారం అందించారు. వెస్ పేస్ 1996 నుండి 2002 వరకు ఇండియన్ రగ్బీ ఫుట్‌బాల్ యూనియన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. స్పోర్ట్స్ మెడిసిన్ వైద్యుడిగా ఆయన ఆసియా క్రికెట్ కౌన్సిల్, ఇండియన్ క్రికెట్ బోర్డ్, ఇండియన్ డేవిస్ కప్ జట్టుతో సహా అనేక క్రీడా సంస్థలకు వైద్య సలహాదారుగా పనిచేశారు.
వెస్ పేస్ 1972లో ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న 24 సంవత్సరాల తర్వాత.. ఆయన కొడుకు లియాండర్ ఏస్ 1996లో అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత టెన్నిస్‌కు మొదటి, ఏకైక పతకాన్ని అందించాడు. పురుషుల సింగిల్స్‌లో లియాండర్ పేస్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. 1952 తర్వాత ఒలింపిక్ వ్యక్తిగత క్రీడల్లో భారత్‌కు ఇదే తొలి పతకం. KD జాదవ్ 1952లో రెజ్లింగ్‌లో దీన్ని సాధించాడు.
వెస్ తరచుగా తన కుమారుడిని ప్రశంసిస్తూ ఉండేవారు. లియాండర్ విజయం గురించి వెస్ మాట్లాడుతూ, 'మొదట, క్రీడా సంస్కృతిని ప్రోత్సహించే వాతావరణంలో లియాండర్ పెరిగాడు. అలాగే లియాండర్‌లో అంతర్లీన ప్రతిభ ఉంది. లియాండర్ టెన్నిస్ కోర్టులో చాలా వేగంగా ఉంటాడు. అతను మొండి పట్టుదలగలవాడని నేను అనుకుంటున్నాను. లియాండర్ వారానికి ఆరు రోజులు, రోజుకు మూడు గంటలు శిక్షణ తీసుకునేవాడని పేర్కొన్నాడు.
మీరు ఛాంపియన్‌గా ఉండాలంటే ప్రాక్టీస్ కొనసాగించాలి. అదే సమయంలో 'నెవర్ గివ్ అప్' అనే వైఖరి తన కుటుంబంలో ఉందని లియాండర్ పేస్ అభిప్రాయపడ్డాడు. లియాండర్ 'ఇదంతా వారసత్వంగా వచ్చింది' అని చెప్పాడు. స్వయంగా తండ్రి అయిన లియాండర్ పేస్ తన కూతురు అయానాకు కూడా ఈ లక్షణాలు ఉన్నాయని నమ్ముతున్నాడు.