ICC Rankings : నంబర్-1 బౌలర్‌గా అవ‌త‌రించిన వరుణ్ చక్రవర్తి

భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ICC పురుషుల T20I బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా నంబర్-1 స్థానాన్ని సాధించాడు.

By -  Medi Samrat
Published on : 17 Sept 2025 3:58 PM IST

ICC Rankings : నంబర్-1 బౌలర్‌గా అవ‌త‌రించిన వరుణ్ చక్రవర్తి

భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ICC పురుషుల T20I బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా నంబర్-1 స్థానాన్ని సాధించాడు. త‌ద్వారా జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. 34 ఏళ్ల వరుణ్ తన ఇటీవలి ప్రదర్శన కారణంగా ఈ ర్యాంకింగ్‌ను అందుకున్నాడు. ఆసియా కప్ 2025లో కూడా వరుణ్ భారత జ‌ట్టు తరపున అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.

వరుణ్‌తో పాటు కుల్దీప్ యాదవ్‌కు కూడా టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 16 స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరుకున్నాడు. వ‌రుణ్ చక్రవర్తి ఆసియా కప్ 2025లో UAEతో ఆడిన మ్యాచ్‌లో 4 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు పాకిస్తాన్‌పై 24 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ సాధించాడు. ఈ ప్రదర్శన కారణంగా వ‌రుణ్‌ ICC బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకాడు. అదే సమయంలో, న్యూజిలాండ్‌కు చెందిన జాకబ్ డఫీ రెండో స్థానానికి దిగజారగా, వెస్టిండీస్‌కు చెందిన అకిల్ హుస్సేన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆడమ్ జంపా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకకు చెందిన నువాన్ తుషార ఆరు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకోగా, పాకిస్థాన్‌కు చెందిన సుఫియా ముఖీమ్, అర్బర్ అహ్మద్ వరుసగా 11, 16వ ర్యాంకుకు ఎగబాకారు.

ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించాడు. ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు 31 పరుగులు చేశాడు. ఈ క్ర‌మంలోనే టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ మొదటి స్థానాన్ని కాపాడుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ 1-1 స్థానాలు ఎగబాకి వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. అదే సమయంలో భారత ఆటగాడు తిలక్ వర్మ రెండు స్థానాలు కోల్పోయాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, యశస్విలు కూడా ర్యాంకులు నష్టపోగా, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 4 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్‌కు చేరుకున్నారు.

దక్షిణాఫ్రికాకు చెందిన డెవాల్డ్ బ్రూయిస్ రెండు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌కు చేరుకోగా, ఐడెన్ మార్క్రామ్ 10 స్థానాలు ఎగబాకి 30వ ర్యాంక్‌కు చేరుకున్నారు. ఐసీసీ టీ20 ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా మొదటి స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్‌కు చెందిన సామ్ అయూబ్ 4 స్థానాలు ఎగబాకి రోస్టన్ చేజ్‌తో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున అభిషేక్ శర్మ 4 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంక్‌లో ఉండగా, అక్షర్ పటేల్ ఒక స్థానం ఎగబాకి 12వ స్థానంలో నిలిచాడు.

Next Story