ఆస్ట్రేలియాలో వైభవ్ సూర్యవంశీ సిక్స‌ర్ల మోత‌.. 14 ఏళ్ల కే వ‌ర‌ల్డ్ రికార్డ్ బ‌ద్ధ‌లు కొట్టాడు..!

యువ సంచ‌ల‌నం వైభవ్ సూర్యవంశీ ఆట రోజురోజుకూ మెరుగవుతోంది.

By -  Medi Samrat
Published on : 24 Sept 2025 2:54 PM IST

ఆస్ట్రేలియాలో వైభవ్ సూర్యవంశీ సిక్స‌ర్ల మోత‌.. 14 ఏళ్ల కే వ‌ర‌ల్డ్ రికార్డ్ బ‌ద్ధ‌లు కొట్టాడు..!

యువ సంచ‌ల‌నం వైభవ్ సూర్యవంశీ ఆట రోజురోజుకూ మెరుగవుతోంది. ప్రస్తుతం భారత అండర్-19 జట్టుతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. బుధవారం జరిగిన రెండో వన్డేలో వైభవ్ 68 బంతుల్లో 70 పరుగులు చేశాడు. వైభవ్ ఇన్నింగ్స్‌లో 5 ఫో, 6 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన పేరిట ఓ ప్రత్యేక రికార్డు లిఖించుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. వైభ‌వ్‌ 10 మ్యాచ్‌ల్లో 41 సిక్సర్లు బాదాడు.

అండర్-19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. ఉన్ముక్త్ చంద్ 2011-12 మధ్య 21 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతడు 38 సిక్సర్లు కొట్టాడు. 2018-2020 మధ్య 27 మ్యాచ్‌లలో 30 సిక్సర్లు కొట్టిన యశస్వి జైస్వాల్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు.

యూత్ వన్డేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్ వీరే..

వైభవ్ సూర్యవంశీ – 2024-25, 10 మ్యాచ్‌ల్లో 41 సిక్సర్లు

ఉన్ముక్త్ చంద్ - 2011-12, 21 మ్యాచ్‌ల్లో 38 సిక్సర్లు

యశస్వి జైస్వాల్ - 2018-20, 27 మ్యాచ్‌ల్లో 30 సిక్సర్లు

సంజూ శాంసన్ - 2012-14, 20 మ్యాచ్‌ల్లో 22 సిక్సర్లు

అంకుష్ బెయిన్స్ - 2013-14, 20 మ్యాచ్‌ల్లో 19 సిక్సర్లు

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి వన్డేలో వేగంగా 38 పరుగులు చేశాడు. ఆ తర్వాత రెండో వన్డేలో 70 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వైభవ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ డజను సిక్సర్లు సెంటర్ అట్రాక్షన్. విహాన్ మల్హోత్రాతో కలిసి రెండో వికెట్‌కు 117 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

భారత్, ఆస్ట్రేలియా అండర్-19 జట్టు మధ్య రెండో యూత్ వన్డే బ్రిస్బేన్‌లో జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.4 ఓవర్లలో 300 పరుగులకు ఆలౌటైంది. భారత్ తరఫున వైభవ్ సూర్యవంశీ (70), విహాన్ మల్హోత్రా (70), అభిజ్ఞాన్ కుందు (71) అర్ధ సెంచరీ ఇన్నింగ్సులు ఆడారు.

Next Story