15 ఫోర్లు, 15 సిక్సర్లతో వైభవ్ సూర్యవంశీ తుఫాను ఇన్నింగ్స్..!

ఐసిసి అండర్-19 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో నేడు ఇంగ్లాండ్‌తో భారత్ తలపడుతుంది.

By -  Medi Samrat
Published on : 6 Feb 2026 3:39 PM IST

15 ఫోర్లు, 15 సిక్సర్లతో వైభవ్ సూర్యవంశీ తుఫాను ఇన్నింగ్స్..!

వైభవ్ సూర్యవంశీ

ఐసిసి అండర్-19 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో నేడు ఇంగ్లాండ్‌తో భారత్ తలపడుతుంది. వరుసగా ఆరో విజయంపై టీమిండియా దృష్టి సారించింది. ఈ టోర్నమెంట్‌లో భారత్‌ అత్యంత విజయవంతమైన జట్టు. 2000, 2008, 2012, 2018, 2022లలో ట్రోఫీని గెలిచింది. ఇప్పుడు ఆయుష్ మాత్రే నాయకత్వంలో జట్టు మరోసారి టైటిల్ గెలుచుకోవాలని చూస్తోంది.

ఈ క్ర‌మంలోనే టాస్ గెలిచిన భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీం ఇండియా తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఆరోన్ జార్జ్ త్వ‌ర‌గానే వెనుదిరిగినా.. వైభవ్ సూర్యవంశీ మాత్రం భారీ ఇన్నింగ్సు ఆడాడు.

జార్జ్ నిష్క్రమణ తర్వాత వైభవ్, కెప్టెన్ మాత్రే తెలివైన ఇన్నింగ్స్ ఆడి జట్టును నిలబెట్టారు. దీంతో 10 ఓవర్లకు భారత్ ఒక వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. 11వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి వైభవ్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈ క్ర‌మంలోనే 15 ఓవర్లు ఆట పూర్తయ్యేస‌రికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. అప్ప‌టికి వైభవ్ 71 పరుగులు, మాత్రే 39 పరుగులు సాధించారు. ఆ త‌ర్వాత ఆయుష్ మాత్రే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్న వెంట‌నే ఔట‌య్యాడు. భారత కెప్టెన్ 51 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. ఆయుష్ అవుట్ అయిన తర్వాత వేదాంత్ త్రివేది క్రీజులోకి వచ్చాడు. ఒక ప‌క్క వైభవ్ సూర్యవంశీ సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డుతున్నాడు.

వైభవ్ సూర్యవంశీ తుఫాను ఇన్నింగ్స్ ముందు ఇంగ్లాండ్ బౌలర్లు నిస్సహాయంగా కనిపించారు. వైభవ్ 79 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో అజేయంగా 175 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లు వికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. భారత్ కేవలం 25 ఓవర్లలోనే 250 పరుగులు చేసింది.

వైభవ్ స్లాగ్ స్వీప్ చేయడానికి ప్రయత్నించ‌గా బంతి బయటి అంచు తీసుకొని గాలిలోకి లేవ‌డంతో ర్యు క్యాచ్ పట్టాడు. దీంతో వైభ‌వ్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ముగిసింది. వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగులు చేశాడు. విహాన్ మల్హోత్రా క్రీజులోకి వచ్చాడు. ప్ర‌స్తుతం 28 ఓవ‌ర్ల‌కు మూడు వికెట్లు కోల్పోయి 264 ప‌రుగులు చేసి ప‌టిష్ట స్థితిలో ఉంది.

Next Story