మ‌నోడే.. చివ‌రి బంతికి సిక్స్ కొట్టి డబుల్ సెంచరీ చేశాడు..!

మంగళవారం విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఓపెనర్ అమన్ రావ్ డబుల్ సెంచరీ సాధించి సంచ‌ల‌నం న‌మోదు చేశాడు.

By -  Medi Samrat
Published on : 6 Jan 2026 4:41 PM IST

మ‌నోడే.. చివ‌రి బంతికి సిక్స్ కొట్టి డబుల్ సెంచరీ చేశాడు..!

మంగళవారం విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఓపెనర్ అమన్ రావ్ డబుల్ సెంచరీ సాధించి సంచ‌ల‌నం న‌మోదు చేశాడు. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో బెంగాల్‌పై 21 ఏళ్ల అమన్ రావ్ తుఫాను ఇన్నింగ్స్ ఆడి 154 బంతుల్లో అజేయంగా 200 పరుగులు చేశాడు. అమెరికాలో పుట్టిన అమన్ రావ్ ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్సర్ కొట్టి డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన ఇన్నింగ్స్‌లో అమన్‌రావు 12 ఫోర్లు, 13 సిక్సర్లు కొట్టాడు.

అతడి ఇన్నింగ్స్ ఆధారంగా హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. రావ్ బెంగాల్ యొక్క బలమైన బౌలింగ్ ఎటాక్‌పై విరుచుకుప‌డ్డాడు.బెంగాల్ జ‌ట్టులో అంతర్జాతీయ పేయ‌ర్లు మహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్, ఆకాష్‌దీప్ వంటి హేమాహేమీలున్నారు. వీరంద‌రినీ ఎదుర్కొని అమన్ రావు అజేయంగా 200 పరుగులు చేశాడు. షమీ, ముఖేష్ కుమార్, ఆకాశ్‌దీప్‌లపై బలమైన దాడి చేసి ఏకంగా 120 పరుగులు చేశాడు. ఇందులో 8 సిక్సర్లు ఉన్నాయి. 108 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన అమన్ రావు.. ఇక్కడి నుంచి పరుగుల వేగాన్ని పెంచిన కేవలం 46 బంతుల్లోనే రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అది కూడా చివరి బంతికి లాంగ్ ఆన్‌లో సిక్స్ కొట్టడం ద్వారా డబుల్ సెంచరీని పూర్తి చేశాడు.

ఇదిలావుంటే.. ఇది లిస్ట్-A క్రికెట్‌లో ఓ హైదరాబాదీ క్రికెటర్ చేసిన అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. అదే సమయంలో విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో 9వ డబుల్ సెంచరీ న‌మోదు అయ్యింది. ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీ సీజన్‌లో ఇది రెండో డబుల్ సెంచరీ. ఇదే సీజ‌న్‌లో సౌరాష్ట్రపై ఒడిశాకు చెందిన స్వస్తిక్ సమాల్ ఈ ఘనత సాధించాడు.

అమన్ రావ్ కుడిచేతి వాటం ఓపెనర్. అమెరికాలోని విస్కాన్సిన్‌లో జన్మించిన అమ‌న్ రావు హైదరాబాద్ త‌రుపున ఆడుతూ అద‌ర‌గొడుతున్నాడు. వైట్ బాల్ క్రికెట్‌లో అతని రికార్డు అద్భుతంగా ఉంది. అండర్-23 స్టేట్ ట్రోఫీలో అమ‌న్‌ ఆరు మ్యాచ్‌లలో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీల సహాయంతో 381 పరుగులు చేశాడు.

విజయ్ హజారే ట్రోఫీకి ముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైపై హాఫ్ సెంచరీ చేయడం ద్వారా అమన్ రావ్ వెలుగులోకి వ‌చ్చాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో అతను 24 పరుగులు బాదాడు. ఈ ప్రదర్శన కారణంగాను అమ‌న్‌కు ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కింది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 30 లక్షలకు అమ‌న్ రావును కొనుగోలు చేసింది.

Next Story