క్రికెట్ అంటే పరుగులు, వికెట్లు, క్యాచ్‌లు, రనౌట్లు, విజయాలు, ఓటములు మాత్రమే కాదు. ఆటలో ఒక్కోసారి సరదా సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫీల్డర్‌కు బదులు అంపైర్ క్యాచ్ పట్టడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా చోటు చేసుకుంది.
ఆస్ట్రేలియా బ్యాటర్ ఆలెక్స్ క్యారీ.. షార్ట్ పిచ్ బాల్‌ను స్వ్కేర్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. బంతి గాల్లోకి లేచింది. అయితే.. అక్కడే అంపైర్ గా విధులు నిర్వర్తిస్తున్న కుమార్ ధర్మసేన క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించాడు. అయితే.. తాను ఫీల్డర్‌ను కాదని అంపైర్ అన్న సంగతి గుర్తుకు వచ్చిందేమో ఏమో తెలీదు కానీ వెంటనే చేతులను వెనక్కి తీసుకున్నాడు. దీన్ని చూసిన ఆటగాళ్లతో పాటు మెదానంలోని ప్రేక్షకులు పగలబడి నవ్వుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంక 2-1తో ఆదిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్లు మద్య నేడు నాలుగో వన్డే కొలంబో వేదికగా జరగనుంది.