నేడు సభ్య దేశాలన్నిటితో ఐసీసీ స‌మావేశం.. పాక్ నిర్ణ‌యం మార్చుకోక‌పోతే..

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తేదీలు, వేదికల‌పై చర్చించడానికి సభ్య దేశాలన్నిటితో ఐసీసీ శుక్రవారం వర్చువల్ సమావేశాన్ని నిర్వహించ‌నున్నాయి.

By Kalasani Durgapraveen  Published on  29 Nov 2024 5:00 AM GMT
నేడు సభ్య దేశాలన్నిటితో ఐసీసీ స‌మావేశం.. పాక్ నిర్ణ‌యం మార్చుకోక‌పోతే..

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తేదీలు, వేదికల‌పై చర్చించడానికి సభ్య దేశాలన్నిటితో ఐసీసీ శుక్రవారం వర్చువల్ సమావేశాన్ని నిర్వహించ‌నున్నాయి. టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. 100 రోజుల కంటే తక్కువ సమయం మిగిలి ఉంది. అటువంటి పరిస్థితిలో అన్ని అంశాలు ఖరారు కావాల్సి ఉంది, అయితే భారత క్రికెట్ జట్టును పాకిస్తాన్‌కు పంపడానికి BCCI నిరాకరించడం.. హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిరాకరించడం సమస్యను క్లిష్టతరం చేసింది. 12 ఐసీసీ పూర్తి సభ్య దేశాల ప్రతినిధులు, అసోసియేట్ నేషన్స్ నుండి ముగ్గురు, ఒక స్వతంత్ర డైరెక్టర్‌తో పాటు ఐసీసీ ఛైర్మన్, సీఈఓ శుక్రవారం సమావేశానికి హాజరుకానున్నారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. ప్యానెల్ ముందు ICC రెండు ప్లాన్‌లను ఉంచే అవ‌కాశం ఉంది. మొదటిది, భారత్ మూడు గ్రూప్ దశ మ్యాచ్‌లను తటస్థ వేదికలో నిర్వహించడం.. టీమ్ ఇండియా నాకౌట్‌కు చేరుకుంటే సెమీ ఫైనల్స్, ఫైనల్స్ కూడా తటస్థ దేశంలో నిర్వ‌హించ‌డం.. ఇక రెండో ప్లాన్ .. భారత క్రికెట్ జట్టు నాకౌట్‌కు అర్హత సాధించకపోతే సెమీఫైనల్, ఫైనల్ రెండూ పాకిస్థాన్‌లోనే జరిగేలా చూడ‌టం. ఇందుకోసం మెంబర్ బోర్డుల మధ్య కూడా ఓటింగ్ నిర్వహించే అవ‌కాశం ఉంది. మెజారిటీ నిర్ణయమే అంతిమంగా ఉంటుందని.. ఆ తర్వాత పీసీబీ తన దిశను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. నివేదికల ప్రకారం.. టోర్నమెంట్ 19 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది.

భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించలేమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. భద్రత, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా జాతీయ క్రికెట్ జట్టును పాకిస్థాన్‌కు పంపకూడదన్న భారత ప్రభుత్వ నిర్ణయానికి ఆయన మద్దతు తెలిపారు. పాకిస్థాన్‌లో భారత పర్యటనను బీసీసీఐ నిర్ణయించదు. భారత ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. ఒకవేళ భార‌త్‌ పాకిస్థాన్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లయితే అది పూర్తిగా సరైనదేన‌న్నారు. ఎక్కడ (ఛాంపియన్స్ ట్రోఫీ) ఆడినా భారత్ లేకుండా జరగదు.. భారత్ లేకుండా ఐసీసీ టోర్నీలు జరగవు అన్నది నిజం. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా సరైనదని పేర్కొన్నాడు.

Next Story