టీ20 ప్రపంచ కప్ లో ఓ వైపు ఆసక్తికర మ్యాచ్ లు సాగుతూ ఉండగా.. మరో వైపు వర్షం కారణంగా మ్యాచ్ లు రద్దవుతూ ఉండడంతో అభిమానులకు కోపం చిర్రెత్తుకు వస్తోంది. నేడు జరగాల్సిన రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అది కూడా ఒక్క బంతి కూడా పడకుండానే..! ఈ ఉదయం ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ వేయకుండానే రద్దు కాగా.. మధ్యాహ్నం జరగాల్సిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ కూడా ఒక్క బంతి పడకుండానే రద్దయింది.
మెల్బోర్న్ లో కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ మధ్యాహ్నం మెల్బోర్న్ లో వర్షం కురవకపోయినా, మైదానం ఆటకు ఏమాత్రం అనువుగా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చెరో పాయింట్ ను దక్కించుకున్నాయి. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం ప్రభావంతో రద్దయింది. దక్షిణాఫ్రికా-జింబాబ్వే మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం తేలకుండానే ముగిసింది. ఐర్లాండ్ తో మ్యాచ్ లో ఇంగ్లండ్ వర్షం కారణంగా డక్ వర్త్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇలాగే జరుగుతూ ఉంటే టోర్నమెంట్ మీద ఆసక్తి వెళ్ళిపోతుందని క్రికెట్ అభిమానులు ఐసీసీని ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో తిడుతూ ఉన్నారు.