పాపం.. షమీకి దక్కలేదు..!
నవంబర్ 2023కు సంబంధించి పురుషుల, మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు విజేతలను ఐసీసీ వెల్లడించింది.
By Medi Samrat Published on 11 Dec 2023 3:45 PM ISTనవంబర్ 2023కు సంబంధించి పురుషుల, మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు విజేతలను ఐసీసీ వెల్లడించింది. దక్షిణాఫ్రికాపై సెమీ-ఫైనల్ విజయం, భారత్‌పై బ్లాక్‌బస్టర్ ఫైనల్ విజయం రెండింటిలోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ నవంబర్ నెలలో ఐసిసి పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచాడు. అవార్డుకు ముగ్గురు ఆటగాళ్లు పోటీపడ్డారు. ఆసీస్ ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్ వెల్, టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమి అవార్డు కోసం తలపడ్డారు. అదృష్టం హెడ్ నే వరించింది.
వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్ లో హెడ్ రాణించాడు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్ లో 48 బంతుల్లో 62 పరుగులు చేయడంతో పాటు హెడ్ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక ఫైనల్ లో 120 బంతుల్లో 137 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. షమి ప్రపంచకప్ లో 24 వికెట్లను సాధించి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఐసీసీ ఓటింగ్ అకాడమీ, ఫ్యాన్స్ వేసిన ఓట్ల ఫలితంగా ప్రకటించిన ఈ అవార్డును హెడ్ దక్కించుకున్నాడు. ఓట్ విలువలో ఐసీసీ ఓటింగ్ అకాడమీకి 90 శాతం, ఫ్యాన్స్ కు 10 శాతం షేర్ ఉంటుంది. ఉమెన్స్ విభాగంలో నవంబర్ నెలకు బంగ్లాదేశ్ ప్లేయర్ నహిదా అక్తెర్ అవార్డును అందుకుంది. అక్టోబరులో జరిగిన ఓటింగ్‌లో స్పిన్ మాస్ట్రో నహిదా ఓడిపోయింది. అయితే గత నెలలో సొంతగడ్డపై పాకిస్తాన్‌పై జరిగిన ODI సిరీస్ ఆమె చేసిన ప్రదర్శనకును గాను నవంబర్‌లో ICC ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకుంది.