ఛట్టోగ్రామ్ లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆతిథ్య బంగ్లాదేశ్ కు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నేడు ఆటకు మూడో రోజు కాగా, రెండో ఇన్నింగ్స్ ను టీమిండియా 258/2 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 110 పరుగులు చేయగా, సీనియర్ ఆటగాడు ఛటేశ్వర్ పుజారా 102 పరుగులతో అజేయంగా నిలిచాడు. పుజారా శతకం పూర్తి చేసుకున్న అనంతరం టీమిండియా తాత్కాలిక సారథి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. కోహ్లీ 19 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆటకు మరో రెండ్రోజులు సమయం ఉండడంతో బంగ్లాదేశ్ బ్యాటర్లు అద్భుతంగా ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ ఆరంభించి 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది.
మూడో రోజు 133/8 స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మరో 17 పరుగులు జోడించి 150 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాట్స్ మెన్లలో ముష్ఫికర్ రహీమ్ చేసిన 28 పరుగులే అత్యధిక వ్యక్తిగత పరుగులు. ఇతర బ్యాట్స్ మెన్లలో జాకీర్ హసన్ 20 పరుగులు, లిట్టన్ దాస్ 24, హసన్ మీరజ్ 25 రన్స్ చేశారు. కుల్దీప్ యాదవ్ 40 పరుగులిచ్చి 5 వికెట్లను కూల్చగా, సిరాజ్ 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లను తీశాడు. ఉమేశ్ యాదవ్, అక్సర్ పటేల్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 254 పరుగుల భారీ ఆధిక్యత లభించింది.