పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025లో లాహోర్ ఖలందర్స్ తరపున ఆడుతున్న బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రిషద్ హుస్సేన్ భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పెరిగిన నేపథ్యంలో భయానక అనుభవాన్ని పంచుకున్నాడు. పాకిస్తాన్ నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు విదేశీ ఆటగాళ్ళు భయపడ్డారని బయటపెట్టాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి చేరుకున్న తర్వాత స్పిన్నర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు, అక్కడి నుండి ఆటగాళ్ళు తమ ఇళ్లకు చేరుకోవడానికి కనెక్టింగ్ విమానాలను తీసుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వారం పాటు వాయిదా వేయాలని నిర్ణయించిన కొన్ని గంటల తర్వాత PSL 2025 కూడా నిలిపివేశారు.
సామ్ బిల్లింగ్స్, డారిల్ మిచెల్, కుశాల్ పెరెరా, డేవిడ్ వైస్, టామ్ కుర్రాన్ వంటి విదేశీ ఆటగాళ్ళు అందరూ చాలా భయపడ్డారని, దుబాయ్‌లో అడుగుపెట్టిన మిచెల్, తాను ఇకపై పాకిస్తాన్‌కు వెళ్లనని తనతో చెప్పాడన్నాడు రిషద్. ఇంగ్లాండ్ క్రికెటర్ టామ్ కుర్రాన్ ఏకంగా ఏడ్చాడని చెప్పాడు. టామ్ కుర్రాన్ విమానాశ్రయానికి వెళ్ళాడని, కానీ విమానాశ్రయం మూసివేశారని తెలుసుకున్నాక చిన్న పిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడని వివరించాడు. అతన్ని సముదాయించడానికి ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు అవసరమయ్యారని రిషద్ వెల్లడించాడు.