2026లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. భారత్‌లోని కొన్ని వేదికల్లో టికెట్ ధరలు కేవలం రూ.100 నుంచి ప్రారంభం అవ్వనున్నాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న పదో ఎడిషన్ మెగా టోర్నీ, 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో 55 మ్యాచ్‌లు ఉంటాయి. అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాతో పాటు శ్రీలంకలోని కొలంబో , క్యాండీ నగరాలు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
భారత్‌లో రూ.100, శ్రీలంకలో 1000 శ్రీలంకన్ రూపాయల నుంచి టికెట్ల ధరలు ప్రారంభం అయ్యాయి. ప్రతి క్రికెట్ అభిమాని క్రికెట్‌ను స్టేడియంలో ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించాలన్నదే తమ లక్ష్యమని బీసీసీఐ తెలిపింది. టికెట్ ధరలు కేవలం రూ.100 నుంచి ప్రారంభం కావడం ఈ టోర్నీపై మరింత ఇష్టాన్ని పెంచుతుందని బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.