Video : కోహ్లీకి ఈరోజు చాలా ప్ర‌త్యేకం.. ఆ సిక్స్‌లు ఇప్పటికీ హరీస్ మ‌ర్చిపోయి ఉండ‌క‌పోవ‌చ్చు..!

భారత జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ఎప్పుడైతే మైదానంలో సెటిల్ అయ్యాడో.. ప్రత్యర్థి జట్టు కష్టాల్లో కూరుకుపోవడం ఖాయం.

By Kalasani Durgapraveen  Published on  23 Oct 2024 5:50 AM GMT
Video : కోహ్లీకి ఈరోజు చాలా ప్ర‌త్యేకం.. ఆ సిక్స్‌లు ఇప్పటికీ హరీస్ మ‌ర్చిపోయి ఉండ‌క‌పోవ‌చ్చు..!

భారత జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ఎప్పుడైతే మైదానంలో సెటిల్ అయ్యాడో.. ప్రత్యర్థి జట్టు కష్టాల్లో కూరుకుపోవడం ఖాయం. కింగ్ కోహ్లీ తన కెరీర్‌లో ఇప్పటివరకు చాలా అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే అక్టోబర్ 23, 2022 అతనికి చాలా ప్రత్యేకమైన రోజు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అతడు చేసిన అద్భుత ఫీట్ ఎప్పుడూ చర్చనీయాంశమైంది. పాక్‌పై కోహ్లి భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ విజయంతో కింగ్ కోహ్లీ అభిమానులకు దీపావళి కానుక ఇచ్చాడు. క్షణ క్షణానికి మారుతున్న మ్యాచ్‌లో ఒత్తిడిని ఎదుర్కొన్న కోహ్లి.. కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. భారత్‌కు శుభారంభం లభించినా.. ఆఖర్లో కోహ్లీ రెండు సిక్సర్లు బాది మ్యాచ్‌ గతిని మార్చేశాడు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. కోహ్లీ కొట్టిన సిక్సర్లు ఇప్పటికీ హరీస్ మనసులో మెదులుతూనే ఉంటాయి.

అది 2022.. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్, భారత్ జ‌ట్ల మ‌ధ్య‌ టీ20 వరల్డ్‌కప్ 2022 మ్యాచ్ జరుగుతుంది. ఈ హైవోల్టేజీ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. షాన్‌ మసూద్‌, ఇఫ్తికర్‌ అహ్మద్ అర్ధ‌సెంచ‌రీలు చేశారు. భారత్‌ తరఫున అర్ష్‌దీప్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్యా 3-3 వికెట్లు తీశారు. ఆ త‌ర్వాత‌ 160 పరుగుల ల‌క్ష్య చేధ‌న‌కు దిగిన‌ భారత జట్టుకు చెడు ఆరంభం లభించింది. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. కోహ్లి 53 బంతులు ఎదుర్కొని 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.


ఈ మ్యాచ్‌లో భారత్‌కు 8 బంతుల్లో 28 పరుగులు అవసరమైనప్పుడు.. విరాట్ కోహ్లీ హరీస్ రవూఫ్ వేసిన‌ వరుస బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టడం ద్వారా మ్యాచ్ గ‌తిని మార్చాడు, మ్యాచ్ తర్వాత ఐసీసీ కోహ్లి కొట్టిన ఓ సిక్స్‌ను 'ఐసీసీ షాట్ ఆఫ్ ది సెంచరీస‌గా ప్ర‌క‌టించింది.

త‌ర్వాతి ఓవ‌ర్‌లో తొలి బంతికే హార్దిక్ పాండ్యాను మహ్మద్ నవాజ్ అవుట్ చేశాడు. రెండో బంతికి దినేష్ కార్తీక్ ఒక పరుగు, మూడో బంతికి కోహ్లీ రెండు పరుగులు సాధించారు. నాలుగో బంతి నో బాల్‌లో కోహ్లి సిక్సర్ కొట్టాడు. ఇప్పుడు మూడు బంతుల్లో ఆరు పరుగులు కావాలి. తర్వాతి బంతి వైడ్.. ఆ తర్వాత బై.. తర్వాత మూడు పరుగులు వచ్చాయి, అయితే ఐదో బంతికి కార్తీక్ ఔటయ్యాడు. అశ్విన్ చివరి బంతికి ఒక్క పరుగు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. హార్దిక్ పాండ్యా 37 బంతుల్లో 40 పరుగులతో ఉప‌యోగ‌క‌ర‌మైన ఇన్నింగ్స్ ఆడాడు.


Next Story