ఆఖ‌రి పంచ్ ఎవ‌రిదో..?

Third T20 match Between India vs New Zealand Today.స్వ‌దేశంలో మ‌రో సిరీస్‌ను చేజిక్కించుకోవాల‌ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Feb 2023 2:38 PM IST
ఆఖ‌రి పంచ్ ఎవ‌రిదో..?

స్వ‌దేశంలో మ‌రో సిరీస్‌ను చేజిక్కించుకోవాల‌ని ఆరాట‌ప‌డుతున్న జ‌ట్టు ఓ వైపు. వ‌న్డే సిరీస్‌లో ఎదురైన ప‌రాభ‌వానికి పొట్టి సిరీస్ గెలిచి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని బావిస్తున్న జ‌ట్టు మ‌రో వైపు. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు స‌మఉజ్జీవుల మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర పోరుకు ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన అహ్మ‌దాబాద్‌లోని స్టేడియం వేదిక కానుంది. నేడు(బుధ‌వారం) భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్లు మూడో టీ20 మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో కివీస్‌, రెండో మ్యాచ్‌లో ఇండియా జ‌ట్టు విజ‌యం సాధించ‌డంతో 1-1తో ఇరు జ‌ట్లు స‌మంగా ఉండగా నేడు గెలిచే జ‌ట్టు సిరీస్ విజేత‌గా నిల‌వ‌నుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద మైదానంలో జరుగనున్న పోరును ఆస్వాదించేందుకు అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. రెండో టీ20లో 100 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించ‌డానికే భార‌త్ అప‌సోపాలు ప‌డిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా టాప్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్లు ఈ సిరీస్‌లో అస‌లు ప‌రుగులే చేయ‌లేదు. సీనియ‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ గైర్హాజ‌రీలో శుభ్‌మ‌న్ గిల్‌, ఇషాన్ కిష‌న్‌, రాహుల్ త్రిపాఠిలు త‌మ‌కు వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో విఫ‌లం అయ్యారు.

ఈ మ్యాచ్ త‌రువాత ఇప్ప‌ట్లో టీమ్ఇండియా టీ20 మ్యాచ్‌లు ఆడ‌దు. ఈ నేప‌థ్యంలో వీరిపై ఒత్తిడి ఉంటుంది అన‌డంలో సందేహం లేదు. అహ్మదాబాద్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరించనుంది. ఈ నేప‌థ్యంలో శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రాహుల్‌ త్రిపాఠి, హార్దిక్‌ పాండ్యా, దీపక్‌ హుడా లు బ్యాట్ ఝుళిపించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

బౌలింగ్‌లోకూ భార‌త్‌కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. రెండో టీ20లో స్పిన్నర్లు సత్తాచాటగా.. అంతకు ముందు రాంచీ వేదికగా జరిగిన పోరులోనూ పేసర్లు తేలిపోయారు. అయితే.. ల‌ఖ్‌నవూలో ఉత్త‌మంగా బౌలింగ్ చేయ‌డం ఫాస్ట్ బౌల‌ర్ అర్ష్‌దీప్ సింగ్ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది అన‌డంలో సందేహం లేదు. చ‌హ‌ల్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ తుది జ‌ట్టులోకి రావొచ్చు.

కివీస్ పోరాటం

తొలి మ్యాచ్‌లో గెలిచి రెండో మ్యాచ్‌లో త‌క్కువ స్కోరే చేసినా గ‌ట్టి పోటిని ఇచ్చింది కివీస్‌. బ్యాటింగ్‌లో కాన్వే, మిచెల్, అలెన్‌లు మంచి ఫామ్‌లో ఉండ‌డం కివీస్‌కు క‌లిసి వ‌చ్చే అంశం. వీరితో పాటు గ్లెన్ ఫిలిప్స్, బ్రాస్ వెల్ లు రాణిస్తే భారీ స్కోర్ ను సాధించ‌డం పెద్ద క‌ష్ట‌మేమి కాదు. బ్యాటింగ్‌తో పోలిస్తే కివీస్ బౌలింగ్ విభాగం ప‌టిష్టంగా ఉంది. కెప్టెన్ శాంట్న‌ర్‌, సోధి, ఫెర్లూస‌న్ ల‌ను భార‌త బ్యాట‌ర్లు ఎలా ఎదుర్కొంటారు అన్న దానిపైనే టీమ్ఇండియా విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డి ఉన్నాయి.

Next Story