క్లీన్‌స్వీప్‌పై క‌న్నేసిన బంగ్లా.. పరువు కోసం భార‌త్ ఆరాటం.. చివ‌రి వ‌న్డే నేడే

Third ODI Match Between India and Bangladesh Today.బంగ్లాదేశ్‌ను సునాయాస‌నంగా ఓడిస్తారు అనుకుంటే సీన్ రివ‌ర్స్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Dec 2022 4:57 AM GMT
క్లీన్‌స్వీప్‌పై క‌న్నేసిన బంగ్లా.. పరువు కోసం భార‌త్ ఆరాటం.. చివ‌రి వ‌న్డే నేడే

బంగ్లాదేశ్‌ను సునాయాస‌నంగా ఓడిస్తారు అనుకుంటే సీన్ రివ‌ర్స్ అయ్యింది. టీమ్ఇండియాపై వ‌రుస‌గా రెండు వ‌న్డేల్లో నెగ్గిన బంగ్లాదేశ్ ఇప్ప‌టికే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు నామ‌మాత్ర‌మైన చివ‌రి వ‌న్డేలోనైనా గెలిచి ప‌రువు ద‌క్కించుకోవాల‌ని ఓ వైపు భార‌త్ ఆరాట‌ప‌డుతోండ‌గా మ‌రోవైపు సిరీస్ నెగ్గిన ఊపులో క్లీన్‌స్లీప్ చేయాల‌ని బంగ్లాదేశ్ కోరుకుంటోంది.

గాయం వేదిస్తున్న‌ప్ప‌టికీ రెండో వ‌న్డేలో అసాధార‌ణంగా పోరాడిన కెప్టెన్ రోహిత్‌శ‌ర్మ ఈ మ్యాచ్‌తో పాటు టెస్ట్ సిరీస్‌కు దూరం అయ్యాడు. రోహిత్ స్థానంలో ఇషాన్ కిష‌న్ ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌కు రాహుల్ సార‌థ్య బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తాడు. భార‌త్ ఓడిన రెండు వ‌న్డేల్లోనూ టాప్ ఆర్డ‌ర్ ఆట‌గాళ్లు రాణించ‌లేదు. ముఖ్యంగా ఓపెన‌ర్ ధావ‌న్‌, ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీలు క‌నీసం ఈ మ్యాచ్‌లోనైనా రాణించాల‌ని జ‌ట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. శ్రేయ‌స్ అయ్య‌ర్ ఒక్క‌డే ప్ర‌స్తుతం ఫామ్‌లో ఉన్నాడు. వీరితో పాటు కేఎల్ రాహుల్ కూడా రాణిస్తే భారీ స్కోర్ చేసే వీలుంది.

మొద‌టి రెండు వ‌న్డేల్లో ఓ ద‌శ‌కు వ‌ర‌కు అద్భుతంగా బౌలింగ్ చేసిన భార‌త బౌల‌ర్లు ఆ త‌రువాత చేతులెత్తేశారు. పేస్ బౌల‌ర్లు సిరాజ్‌, శార్దూల్‌, ఉమ్రాన్‌ల‌తో పాటు సుంద‌ర్ , అక్ష‌ర్‌లు ఎలా బౌలింగ్ చేస్తారు అన్న దానిపైనే భార‌త విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డి ఉన్నాయి. షాబాద్ స్థానంలో కుల్దీప్ యాద‌వ్‌కు తుది జట్టులో చోటు ద‌క్క‌వ‌చ్చు.

మ‌రోవైపు బంగ్లాదేశ్ రెట్టించిన ఉత్సాహంతో బ‌రిలోకి దిగుతోంది. పుల్ ఫామ్‌లో ఉన్న మెహ‌దీ హ‌స‌న్ మిరాజ్‌ల‌కు తోడు ష‌కీబ్‌, మ‌హ్మ‌దుల్లా లాంటి ఆల్‌రౌండ‌ర్లు బంగ్లా విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. మ‌రో సారి ఈ ముగ్గురు రాణిస్తే టీమ్ఇండియాకు క‌ష్టాలు త‌ప్ప‌వు.

Next Story
Share it