World Cup Final: టీమిండియా ఓటమికి కారణాలు ఇవే!

భారత్‌ మూడోసారి వరల్డ్‌కప్‌ని గెలవాలని కోరుకున్న క్రికెట్‌ అభిమానుల కల కలగానే మిగిలిపోయింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

By అంజి  Published on  20 Nov 2023 6:40 AM IST
India, World Cup final, Australia, World cup winner Australia, Rohit Sharma, Virat Kohli

World Cup Final: టీమిండియా ఓటమికి కారణాలు ఇవే!

భారత్‌ మూడోసారి వరల్డ్‌కప్‌ని గెలవాలని కోరుకున్న క్రికెట్‌ అభిమానుల కల కలగానే మిగిలిపోయింది. గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక 240 పరుగుల టార్గెట్‌ని ఆస్ట్రేలియా చాలా ఈజీగా ఛేదించింది. అయితే వరల్డ్‌ కప్‌ లీగ్‌లో కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని భారత్‌ ఫైనల్‌లో ఓడిపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే టీమిండియా ఓడిపోవడానికి కొన్ని ప్రధాన కారాణాలు ఉన్నాయి. వరల్డ్‌ కప్‌ ప్రారంభం నుంచి రోహిత్‌ శర్మ దూకుడు కొనసాగించాడు. ఈ టోర్నీలో అతడి 121 స్ట్రైక్‌ రేట్‌ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఫైనల్‌ మ్యాచ్‌లో మరింత చెలరేగి ఆడిన రోహిత్‌.. వ్యక్తిగత స్కోరు 47 పరుగుల దగ్గర ఔట్‌ అయ్యాడు.

రోహిత్‌ జాగ్రత్తగా ఆడి కొంచెం పెద్ద స్కోరు చేసి బావుండేదని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అద్బుతమైన ఫీల్డింగ్ చేశారు. టీమిండియా ఫీల్డింగ్‌తో పోల్చితే చాలా బెటర్‌గా గ్రౌండ్‌లో కదిలారు. బౌండరీల వద్ద విన్యాసాలు చేస్తూ బంతులను అడ్డుకున్నారు. సెంచరీ హీరో ట్రావీస్ హెడ్ రోహిత్ శర్మ ఇచ్చిన అత్యంత క్లిష్టమైన క్యాచ్‌ని అందుకున్నాడు. మరో సీనియర్ డేవిడ్ వార్నర్ వయసుతో సంబంధం లేకుండా పలు బౌండరీలను సేవ్ చేశాడు. ఈ విధంగా భారత్ పరుగులను విజయవంతంగా నియంత్రించారు. కెప్టెన్ కమ్మిన్స్ మంచి ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్ చేయడం కూడా వారికి కలిసొచ్చింది. ఇది భారత బ్యాటర్‌లను ఒకింత నిరాశకు గురి చేసిందని చెప్పాల్సిందే.

ఓపెనర్ శుభ్‌మన్ గిల్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌లకు ఇది మొదటి వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్. దీంతో వారిలో ఒకింత ఆందోళన కనిపించింది. సులభంగా బంతిని క్యాచ్‌గా ఇచ్చి గిల్ వెనుదిరిగాడు. ఇక నెదర్లాండ్స్, న్యూజిలాండ్‌లపై వరుస సెంచరీలు కొట్టిన శ్రేయస్ ఫైనల్ మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. 3 బంతుల్లోనే ఇన్నింగ్స్ ముగించాడు. ఇండియా 81 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత కోహ్లీ, రాహుల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. పరిస్థితికి తగ్గట్టు ఆడారు. ఇటు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అదరగొట్టాడు. టోర్నీ మొత్తం మీద 10 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లే పడగొట్టినప్పటికీ ఫైనల్ మ్యాచ్‌లో రాణించాడు.

కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ల వికెట్లు తీసి జట్టుకు తిరుగులేని ఆధిపత్యాన్నిఅందించాడు. ఆ తర్వాత టీమిండియా ఏ సమయంలో పెద్దగా పరుగులు రాబట్టలేకపోయింది. రన్ రేట్ బాగా నెమ్మదించింది. దీంతో భారత్ తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో ఆసీస్‌ విజయవంతమైంది. వరల్డ్ మొత్తం అదరగొట్టిన టీమిండియా బౌలర్లు ఫైనల్ మ్యాచ్‌లో అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయారు. ఆరంభంలో 3 వికెట్లు తీయడంతో ఆశలు చిగురించినా ఆ తర్వాత ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ట్రావిస్ హెడ్, లబూషేన్ నెలకొల్పిన భారీ పార్టనర్‌షిప్‌ టీమిండియా ఓటమికి బాటలు వేసింది.

Next Story