హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు నిరాశే.. భాగ్యనగరంలో ఐపీఎల్ మ్యాచ్‌లు లేవు..!
There Is No IPL Matches In Hyderabad IPL 2021 Stadiums List.హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు నిజంగా బ్యాడ్‌న్యూస్ ఇది.భాగ్యనగరంలో ఐపీఎల్ మ్యాచ్‌లు లేవు.
By తోట వంశీ కుమార్ Published on 28 Feb 2021 12:00 PM ISTహైదరాబాద్ క్రికెట్ అభిమానులకు నిజంగా బ్యాడ్‌న్యూస్ ఇది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ను యూఏఈ వేదికగా నిర్వహించడంతో.. ప్రత్యక్షంగా నగరవాసులు మ్యాచ్‌లను చూసే అవకాశం దక్కలేదు. ఈ ఏడాది ఐపీఎల్‌ను భారత్‌లోనే నిర్వహిస్తామని బీసీసీఐ స్పష్టం చేయడంతో.. ఈ సారి అయినా మ్యాచ్‌లను చూడొచ్చునని భావించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురుకానుంది. కరోనా కారణంగా వేదికల్ని బీసీసీఐ కుదించాలని నిర్ణయించడంతో హైదరాబాద్ వాసులకు లీగ్ భాగ్యం లేనట్లే. ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లను 6 వేదికలకే పరిమితం చేయనున్నట్లు బోర్డు వర్గాల సమాచారం. వాటిలో ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతానికి చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలను మాత్రమే వేదికలుగా ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ముంబైలో కరోనా కేసులు పెరుగుతుండడంతో.. హైదరాబాద్‌కు అవకాశం దక్కుతుందని భావించారు. అయితే.. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకుల్లేకుండా మ్యాచ్‌లు ముంబైలో నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో హైదరాబాద్‌కు నిరాశే ఎదురైంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్, జైపూర్, మొహాలిలను పక్కన పెట్టారు. గతంలో మాదిరి వేర్వేరు జట్ల వేర్వేరు వేదికల్లో తలపడటం కాకుండా.. జట్లన్నింటినీ ఒకే చోట ఉంచి వరుసగా ఒక స్టేడియంలో కొన్ని మ్యాచులు నిర్వహించి.. తరువాత మరో వేదికకు అన్ని జట్లనూ తరలించి అక్కడ మ్యాచ్‌లు నిర్వహించేలా బోర్డు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో క్వారంటైన్ నిబంధనలు పాటించడానికి వీలుపడుతుంది. ఇక ప్రపంచంలోని అతి పెద్ద స్టేడియంగా రూపుదిద్దుకున్న మొతెరాలో మ్యాచ్‌లు నిర్వహిస్తే.. లీగ్ కు కళ వస్తుందన్న ఉద్దేశంతో అహ్మదాబాద్ కేంద్రంగా ఏ ప్రాంచైజీ లేకపోయినా దాన్ని ఒక వేదికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, మీడియాలో వస్తున్న వార్తలు నిజమైతే.. తమ జట్టుకు, అభిమానులకు గుండె పగిలే వార్తేనని హోం గ్రౌండ్ కోల్పోయిన ఫ్రాంచైజీలకు సంబంధించిన ఓ అధికారి తెలిపాడు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మార్చి ఫస్ట్ వీక్‌లో సమావేశం కానుంది. ఈ భేటీలో ఐపీఎల్ 2021 షెడ్యూల్‌ను ఖారారు చేయనుంది.