వన్డే సిరీస్ ఓటమి వెనుక ఐదుగురు 'విలన్లు'

2017లో తొలిసారి న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన భారత జట్టు.. వరుసగా రెండోసారి స్వదేశంలో కివీస్ జట్టు చేతిలో ఇబ్బంది పడింది.

By -  Medi Samrat
Published on : 19 Jan 2026 2:44 PM IST

వన్డే సిరీస్ ఓటమి వెనుక ఐదుగురు విలన్లు

2017లో తొలిసారి న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన భారత జట్టు.. వరుసగా రెండోసారి స్వదేశంలో కివీస్ జట్టు చేతిలో ఇబ్బంది పడింది. ఇండోర్‌లో జరిగిన మూడో, చివరి వన్డేలో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ తన 54వ వన్డే సెంచరీని సాధించాడు.. కానీ అతను కూడా జట్టును ఓటమి నుండి రక్షించలేకపోయాడు.

2024లో గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో 36 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన భారత్.. ఇప్పుడు 2026లో అతని కోచింగ్‌లోనే 37 సంవత్సరాలలో మొదటిసారిగా స్వదేశంలో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఈ ఫలితం టాప్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ ఫ్లాప్, బౌలింగ్‌, బ్యాటింగ్ రెండింటిలో రవీంద్ర జడేజా వైఫల్యం వంటి అనేక చర్చనీయాంశాలను లేవనెత్తింది. భారత్ వన్డే సిరీస్ ఓటమికి విలన్లు ఎవరో ఒకసారి చూద్దాం?

1. పవర్‌ప్లేలో రోహిత్ శర్మ నెమ్మదించడం..

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో వెటరన్ రోహిత్ శర్మ భారత్ ఓటమికి విలన్ అని నిరూపించాడు. మూడు మ్యాచ్‌ల్లోనూ అతను తన లయను కోల్పోయి జట్టుకు దూకుడు ప్రారంభాన్ని అందించడంలో విఫలమైనట్లు కనిపించాడు.

2. రవీంద్ర జడేజా ఫ్లాప్..

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫ్లాప్ షోతో కనిపించాడు. బ్యాట్, బంతితో విఫ‌ల‌మ‌య్యాడు. ఇది కూడా టీమిండియా ఓటమికి ప్రధాన కారణం. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో జడేజా విఫలమయ్యాడు. దీనిని కివీస్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. చివరి వన్డే మ్యాచ్‌లో జ‌డేజా 6 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. మొత్తం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో జ‌డేజా బ్యాటింగ్‌లో 4, 27, 12 పరుగులు మాత్రమే చేశాడు. అతడిని చూస్తుంటే 'అసలు' జడేజా ఎక్కడో తప్పిపోయినట్లు అనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో అతడి వన్డే భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

3. నిరాశపరిచిన‌ మిడిల్ ఆర్డర్..

కేవలం రోహిత్, జడేజాలే కాదు, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు కూడా నిరాశపరిచారు. ఒకానొక సమయంలో చివరి ODIలో భారత్‌ 28/0 స్కోరుతో ఉండగా.. స్కోరు 71 పరుగుల‌కే 4 వికెట్లు పడిపోయాయి. 9 ఓవర్లలోనే 4 వికెట్లు పడిపోవడం జట్టు మిడిల్ ఆర్డర్ వైఫ‌ల్యాన్ని చూపిస్తుంది. విరాట్ కోహ్లీ మాత్రమే ఒంటరిగా పోరాడి 124 పరుగులు చేశాడు. కానీ అతనికి అవతలి ఎండ్ నుండి ఎటువంటి మద్దతు లభించలేదు. నితీష్ కుమార్ రెడ్డి 52 పరుగులు చేసి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అయ్యర్, రాహుల్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు న్యూజిలాండ్ బౌలర్లకు లొంగిపోయారు.

4. ప్ర‌భావం చూప‌ని కుల్దీప్ యాదవ్..

మూడో వన్డేలో భారీగా ప‌రుగులిచ్చి భారత జట్టు ఓటమికి కార‌ణ‌మైన వారిలో కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నాడు. 6 ఓవర్లలో 48 పరుగులిచ్చి 1 వికెట్ మాత్రమే పడగొట్టాడు.

5. కేఎల్ రాహుల్ కోహ్లీకి మ‌ద్ద‌తు ఇచ్చివుంటే..

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్.. మూడో వన్డేలో ఫ్లాప్ అయ్యాడు. కోహ్లీకి మద్దతు ఇవ్వలేకపోయాడు. 6 బంతులు ఎదుర్కొన్న కేఎల్ 1 పరుగు చేసి ఔటయ్యాడు. అతను కోహ్లీకి మద్దతునిచ్చి భాగస్వామ్యాన్ని నెలకొల్పినట్లయితే, బహుశా మ్యాచ్ ఫలితం భిన్నంగా ఉండేది.

Next Story