నేడే చారిత్రక 1000వ వన్డే.. చిరస్మరణీయం అయ్యేనా..!
Team India Will play its 1000th ODI Today.మన దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజే వేరు. ఇక్కడ క్రికెట్‌ను ఓ మతంలా బావిస్తారు
By తోట వంశీ కుమార్ Published on 6 Feb 2022 12:55 PM ISTమన దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజే వేరు. ఇక్కడ క్రికెట్‌ను ఓ మతంలా బావిస్తారు. క్రికెటర్లను దేవుళ్లుగా కొలుస్తుంటారు. ఇక ఈ రోజు భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. అందుకు ప్రధాన కారణం. ఈ రోజు టీమ్ఇండియా తన 1000 వ వన్డే మ్యాచ్ ఆడబోతుంది. భారత క్రికెట్‌లో ఎన్నో మరపురాని మైలురాళ్లకు సాక్షిగా నిలిచిన మొతెరా (నరేంద్రమోదీ) స్టేడియం.. ఈ చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. రోహిత్ సారధ్యంలో బరిలోకి దిగుతున్న టీమ్ఇండియా ఈ మ్యాచ్‌లో గెలిచి మధురజ్ఞాపకంగా మలుచుకోవాలని బావిస్తోంది. వన్డే క్రికెట్ చరిత్రలో 1000వ మ్యాచ్ ఆడనున్న తొలి జట్టుగా టీమ్ఇండియా రికార్డుల్లోకి ఎక్కనుంది.
మాజీ కెప్టెన్ విరాట్ ఎక్కడ వదిలేశాడో.. అక్కడి నుంచే ప్రారంభిస్తానని నూతన సారథి రోహిత్ శర్మ స్పష్టం చేయగా.. వచ్చే ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం జట్టును సిద్ధం చేసేందుకు ద్రవిడ్ ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇక కెప్టెన్సీ బాధ్యతలు పక్కన పెట్టాక తనలోని పోరాట యోధుడిని మరోసారి ప్రపంచానికి చాటాలని కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ క్రమంలో నేడు అహ్మదాబాద్ వేదికగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా తలపనుంది.
కరోనా మహమ్మారి కారణంగా ఈ సిరీస్‌కు ప్రేక్షకులను అనుమతించడం లేదు. గాయం కారణంగా సఫారీ పర్యటనకు దూరం అయిన రోహిత్ శర్మ ఈ సిరీస్‌కు అందుబాటులోకి రావడం జట్టుకు అతిపెద్ద సానుకూలంశం. రోహిత్ కు జతగా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయనున్నాడు. ఇక అన్ని టెన్షన్లు పక్కన బెట్టి.. ఈ మ్యాచ్‌లో శతకం చేయాలని విరాట్ అభిమానులు ఆశిస్తున్నారు. బ్యాటింగ్‌లో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ ఉండనున్నారు. ఆల్‌రౌండర్ కోటాలో దీపక్ హుడా లేదా వాషింగ్టన్ సుందర్‌కు చోటు దక్కనుంది. బౌలర్లలో దీపక్ చాహర్, శార్దూల్, కుల్దీప్, చాహల్, ప్రసిద్ధ్ కృష్ణకు చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్‌ను చేజిక్కించుకొని మంచి జోష్‌లో ఉన్న వెస్టిండీస్ అదే జోరులో టీమ్‌ఇండియాకు షాక్ ఇవ్వాలని బావిస్తోంది. కీరన్ పొలార్డు నేతృత్వంలోని వెస్టిండీస్ జట్టు సమతూకంగా ఉంది. భారీ హిట్లర్లు ఉన్న విండీస్ టీం క్షణాల్లో వ్యవధిలో మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగలదు. ఈ సిరీస్ కోసమే కొందరు సీనియర్ ఆటగాళ్లను కూడా ఆ జట్టులో చేర్చారు. చాలా కాలంగా ఇండియాలో వన్డే సిరీస్ గెలవడని వెస్టిండీస్ ఈ సారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది.