టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ 2021 : పెద్ద జ‌ట్ల‌పై తేలిపోయారు.. చిన్న జ‌ట్ల‌పై విరుచుకుప‌డ్డారు

Team India T20 World cup 2021 Journey.టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ 2021లో టీమ్ఇండియా సెమీస్ చేర‌కుండానే ఇంటిముఖం ప‌ట్టింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Nov 2021 9:41 AM GMT
టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ 2021 : పెద్ద జ‌ట్ల‌పై తేలిపోయారు.. చిన్న జ‌ట్ల‌పై విరుచుకుప‌డ్డారు

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ 2021లో టీమ్ఇండియా సెమీస్ చేర‌కుండానే ఇంటిముఖం ప‌ట్టింది. ఈ టోర్నీలో టీమ్ఇండియా అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. రోహిత్‌, కోహ్లీ, రాహుల్‌, పంత్, హార్థిక్ వంటి.. ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించ‌గ‌ల ఆట‌గాళ్లు ఉన్న‌ప్ప‌టికి స్థాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక చ‌తికిల‌బ‌డింది. ప్ర‌పంచ క‌ప్ ఆరంభానికి ముందే.. త‌న‌కు కెప్టెన్‌గా ఇదే చివ‌రి టీ20 ప్ర‌పంచ క‌ప్ అని కోహ్లీ ప్ర‌క‌టించ‌డంతో.. ఈ సారి ఖ‌చ్చితంగా క‌ప్పు కొడ‌తారని అభిమానులు భావించారు. పైగా దిగ్గ‌జ ఆట‌గాడు మ‌హేంద్ర సింగ్ ధోని ని మెంటార్‌గా నియ‌మించ‌డంతో అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ.. ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌న తొలి మ్యాచ్‌లోనే చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్ చేతిలో భంగ‌ప‌డి.. ఆ జ‌ట్టు చేతిలో ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లోనే తొలి ప‌రాజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ ఓట‌మిని అభిమానులు ఇప్ప‌టికి జీర్ణించుకోలేక‌పోతున్నారు.

పాక్ చేతిలో ఓట‌మి అనంత‌రం దెబ్బ‌తిన్న పులిలా టీమ్ఇండియా బ‌లంగా పుంజుకుంటుంద‌ని బావించారు. అయితే.. అలాంటిది ఏమీ జ‌ర‌గ‌లేదు. కివీస్ చేతిలోనూ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో క‌నీసం పోరాడ‌కుండానే ఓడిపోయారు. దీంతో సెమీస్ అవ‌కాశాలు స‌న్న‌గిల్లాయి. ఇత‌ర జ‌ట్ల ఫ‌లితాల‌పై ఆధార‌ప‌డాల్సి వ‌చ్చింది. చేతులు కాలాక‌.. ఆకులు ప‌ట్టుకున్న చందంలా త‌యారు అయ్యింది టీమ్ఇండియా ప‌రిస్థితి. ప‌సికూన‌లు అఫ్గానిస్థాన్‌, స్కాట్లాండ్‌, న‌మీబీయా జ‌ట్ల‌పై విజృంభించి ఆడారు. బ్యాట్స్‌మెన్లు పోటీప‌డి బౌండ‌రీల‌తో ప‌రుగుల వ‌ర‌ద పారించ‌గా.. తాము త‌క్కువ కాద‌న్న‌ట్లు బౌల‌ర్లు వికెట్లతో పండుగ చేసుకున్నారు. ప‌సికూన‌ల‌పై సాధించిన ఈ విజ‌యాలు.. ఓదార్పు మాత్ర‌మే. ఈ టోర్నీలో టీమ్ఇండియా త‌మ స్థాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేద‌నేది కాద‌న‌లేని వాస్త‌వం.

బ‌యో బ‌బుల్ కార‌ణ‌మా..?

టీమ్ఇండియా ఓట‌మికి చాలా కార‌ణాలు వినిపిస్తున్నాయి. అందులో బ‌యో బ‌బుల్ ఒక‌టి. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఆట‌గాళ్లంతా బ‌యో బ‌బుల్ లో ఆడాల్సి వ‌స్తోంది. సుదీర్ఘ కాలం పాటు కుటుంబాల‌కు దూరంగా ఉండ‌డంతో ఆట‌గాళ్ల‌పై ఈ ప్ర‌భావం ప‌డుతోంది. టీమ్ఇండియా ఆట‌గాళ్లు జూన్‌లో ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న మొద‌లు ఆరు నెల‌లుగా బ‌బుల్‌లోనే ఉన్నారు. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఈ విష‌యంపై దృష్టి సారించాలి. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) అనుస‌రిస్తున్న విధానాన్ని అనుస‌రిస్తే ఆట‌గాళ్లకు త‌గినంత విశ్రాంతి ల‌భించే అవ‌కాశం ఉంది. ఇంగ్లాండ్ జ‌ట్టులో మూడు ఫార్మాట్ల‌లో ఆడే ఆట‌గాళ్లు చాలా త‌క్కువ మంది ఉన్నారు.

ఫార్మాట్ల‌కు త‌గ్గ‌ట్టుగా జట్టు ఎంపిక ఉంటుంది. దీంతో ఆట‌గాళ్ల‌కు విశ్రాంతి ల‌భిస్తోంది. భార‌త జ‌ట్టులో కోహ్లీ, రోహిత్‌, రాహుల్, పంత్ వంటి ఆట‌గాళ్లు మూడు ఫార్మాట్ల‌లోనూ ఆడ‌తున్నారు. దీంతో వీరిపై అధిక‌భారం ప‌డ‌డంతో పాటు ఎక్కువ కాలం బ‌యోబ‌బుల్‌తో ఉండ‌డంతో వారు శారీర‌కంగానే కాకుండా మాన‌సికంగా కూడా అల‌సిపోతున్నారు. ఈ విష‌యంపై బీసీసీఐ సెల‌క్ట‌ర్లు పున‌రాలోచించాలి. భార‌త్ రిజ‌ర్వు బెంచ్ కూడా చాలా ప‌టిష్టంగా ఉంది. కాబ‌ట్టి ఒక్కో సీరీస్‌కు సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌కు రోటేష‌న్ ప‌ద్ద‌తిలో విశ్రాంతి ఇస్తూ.. యువ ఆట‌గాళ్ల‌కు అవ‌కాశాలు క‌లిపిస్తే ఆట‌గాళ్లు కూడా నూతనోత్సాహంతో బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది.

అన్నీ మ‌రిచి కొత్త కోచ్, కొత్త కెప్టెన్ ఆధ్వ‌ర్యంలో..

గ‌తం గ‌తః అన్న దాని ప్ర‌కారం ఈ టోర్నీలో ఎదురైనా ప‌రాజ‌యాన్ని జ‌ట్టు ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా మ‌రిచి రానున్న రెండు ప్ర‌పంచ‌క‌ప్‌లపై దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంది. 2022లో ఆస్ట్రేలియా వేదిక‌గా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నుండ‌గా.. 2023లో భార‌త్ వేదిక‌గా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఈ రెండు ప్ర‌పంచ‌క‌ప్‌లే ల‌క్ష్యంగా ఇప్ప‌టి నుంచి జ‌ట్టును రూపొందించుకోవాల్సి ఉంది. కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్, టీ20ల్లో కొత్త కెప్టెన్ జ‌ట్టుతో ఎంత త్వ‌ర‌గా క‌లిసిపోతార‌న్న‌ది చాలా కీల‌కం. ఇక భార‌త టీ20 జ‌ట్టుకు కొత్త సార‌ధి ఎవ‌రు అన్న దానిపై ఆస‌క్తి నెల‌కొంది. రోహిత్‌, కేఎల్ రాహుల్ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.

ఇక భారత్ అండ‌ర్ -19, భార‌త్‌-ఎ జ‌ట్ల‌కు కోచ్‌గా పని చేసిన ద్రావిడ్‌.. ఈనెల 17న న్యూజిలాండ్‌తో ఆరంభ‌మ‌య్యే సిరీస్ నుంచి ప్ర‌ధాన కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. 2007లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇలాగే అవ‌మాన‌క‌ర రీతిలో గ్రూప్ ద‌శ‌లోనే నిష్ర్క‌మించిన భార‌త జ‌ట్టు 2011లో విశ్వ విజేత‌గా నిలిచింది. ఇప్పుడు కూడా దాన్ని పున‌రావృతం చేసిన భార‌త జ‌ట్టు వ‌చ్చే టీ 20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఛాంపియ‌న్‌గా నిల‌వాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Next Story