సెమీస్ అవకాశాలు సజీవం.. ఇలా జరిగితేనే భారత్‌కు అవకాశం
Team India still have semifinal chances in T20 World Cup.ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్ 2021లో భారత జట్టు బోణీ
By తోట వంశీ కుమార్ Published on 4 Nov 2021 2:49 PM ISTఎట్టకేలకు టీ20 ప్రపంచకప్ 2021లో భారత జట్టు బోణీ కొట్టింది. నాకౌట్ అవకాశాలు సన్నగిన వేళ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచి రన్‌రేట్‌ను మెరుగుపరచుకుని గ్రూప్-2లో ఉన్న భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (47 బంతుల్లో 74; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకోగా.. హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషబ్ పంత్ (13 బంతుల్లో 27; ఒక ఫోర్, 3 సిక్సర్లు) లు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. అఫ్గాన్ బౌలర్లలో నైబ్, కరీం చెరో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ మహమ్మద్ నబీ (35), కరీం జనత్ (22 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మాత్రమే రాణించగా.. మిగతావారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో షమి మూడు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ 2, బుమ్రా, జడేజా చెరో వికెట్ తీశారు.
భారత్ సెమీస్ చేరాలంటే..?
భారత జట్టు సెమీస్ చేరాలంటే అంత సులభం కాదు. టీమ్ఇండియా సెమీస్ చేరాలంటే.. న్యూజిలాండ్ జట్టు ఆడనున్న రెండు మ్యాచుల్లో ఒకటి అయినా ఓడిపోవాల్సి ఉంటుంది. అలాగే భారత జట్టు తన చివరి రెండు మ్యాచుల్లో భారీ విజయాలను నమోదు చేయాలి. తద్వారా నెట్‌రన్‌రేట్ అఫ్గాన్ కన్నా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం అఫ్గాన్ రన్‌రేటు 1.481 గా ఉంది. భారత రన్‌రేటు 0.073గా ఉంది. ఈ నేపథ్యంలో అభిమానుల ఆశలు అన్ని ప్రధానంగా అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ గెలవాలని అఫ్గాన్ ప్రజలతో పాటు 130 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నారు.