బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టులో భారత్ ఘన విజయం సాధించి వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకింది. ఐసీసీ డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న టీమిండియా.. ఆదివారం రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 188 రన్స్ తేడాతో గెలిచిన భారత్.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా ఓటమితో.. టీమిండియా రెండో స్థానానికి చేరుకుంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్‌కు చేరుకోవడం దాదాపు ఖాయమైంది. సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా విజయం సాధించడంతో భారత్‌కు కలిసి వచ్చింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ సైకిల్ ముగియనుండగా.. టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధిస్తాయి. పాయింట్ల పట్టికలో నిలిచే తొలి రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌గా నిలుస్తుంది. తొలి ఎడిషన్‌లో భారత్‌పై నెగ్గిన న్యూజిలాండ్ చాంపియన్‌గా నిలువగా.. ప్రస్తుతం 2021-2023 చాంపియన్ షిప్ సైకిల్ కొనసాగుతోంది. ఓవల్ స్టేడియంలో వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.