బంగ్లాదేశ్ టూర్‌లో తొలి వన్డేలో ఒక వికెట్ తేడాతో పరాజయాన్ని చవిచూసిన భారత జట్టుకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో ఏకంగా 80 శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా షెడ్యూల్ సమయానికి ఓవర్లు పూర్తి చేయలేకపోతే 20 శాతం మ్యాచ్ ఫీజుని పెనాల్టీగా విధిస్తారు.. అయితే తొలి వన్డేలో భారత్ ఓవర్ రేటుకి ఏకంగా నాలుగు ఓవర్లు తక్కువగా వేసింది. ఒక్కో ఓవర్‌కి 20 శాతం లెక్కన 80 శాతం మ్యాచ్ ఫీజును కోత విధించింది. స్లో ఓవర్ రేటు వేసినందుకు రిఫరీకి క్షమాపణలు తెలిపిన రోహిత్ శర్మ, మ్యాచ్ ఫీజు కోతకి అంగీకరించాడు.
'ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ నిబంధన ప్రకారం.. స్లో ఓవర్ రేటు చేసిన జట్టు ప్లేయర్లకు, సపోర్టింగ్ స్టాఫ్‌కి, అలాగే జట్టుతో సంబంధం ఉన్న ఇతర సిబ్బందికి ఒక్కో ఓవర్‌కి 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించారు. మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగల్లే, టీమిండియా నెట్ ఓవర్ రేటుకి ఏకంగా నాలుగు ఓవర్లు తక్కువగా వేసినట్టు గుర్తించారు.' అని ఐసీసీ తెలిపింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 41.2 ఓవర్లలో 186 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న బంగ్లాదేశ్ ను మెహదీ హసన్, ముస్తాఫిజుర్ రహ్మన్ విజయ తీరాలకు చేర్చారు. 10వ వికెట్‌కి 51 పరుగులు జోడించి... బంగ్లాదేశ్ కి చారిత్రక విజయాన్ని అందించారు. ఇరు జట్ల మధ్య బుధవారం, డిసెంబర్ 7న రెండో వన్డే జరగనుంది.