IND Vs ENG: రెండో టెస్టులో నలుగురు స్పిన్నర్లు.. టీమిండియా ప్రయోగం!

భారత్ వేదికగా ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జరుగుతోంది.

By Srikanth Gundamalla  Published on  31 Jan 2024 12:41 PM IST
team india, england, second test, vizag, cricket,

IND Vs ENG: రెండో టెస్టులో నలుగురు స్పిన్నర్లు.. టీమిండియా ప్రయోగం!

భారత్ వేదికగా ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జరుగుతోంది. ఇప్పటికే తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచింది. హైదరాబాద్‌ ఉప్పల్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగ్గా భారత్‌ ఓటమి పాలైంది. అయితే.. రెండో టెస్టు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. విశాఖ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రయోగాలకు సిద్ధం అవుతోంది. తొలి టెస్టు మ్యాచ్‌ తర్వాత కేఎల్ రాహుల్, జడేజా ఇద్దరూ టీమ్‌కు దూరం అయ్యారు. తద్వారా స్పిన్‌కు అనుకూలించే విశాఖ ట్రాక్‌పై భారత్‌ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుందని తెలుస్తోంది.

టీమిండియా ఆల్‌రౌండర్‌ జడేజా తొండకండరాలు పట్టేయడంతో టీమ్‌కు దూరం అయ్యాడు. ఈ నేపథ్యంలో అశ్విన్‌తో పాటు అక్షర్‌ పటేల్‌ భారత స్పిన్‌ విభాగాన్ని లీడ్‌ చేస్తాడని.. వీరితో పాటు జడేజాకు రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌ తుది జట్టులో ఉంటారని ప్రచారం జరుగుతోంది. సుందర్, కుల్దీప్‌ జట్టులో చేరితే మాత్రం మహ్మద్‌ సిరాజ్‌పై వేటుపడే అవకాశం లేకపోలేదు. పైగా తొలి టెస్టులో సిరాజ్‌ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. ఇప్పుడు వైజాగ్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలం కాబట్టి స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకు టీమిండియా ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. మరోవైపు ఈ నిర్ణయం కూడా సరైనదే అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఇదే విషయంపై భారత మాజీ చీఫ్‌ సెలెక్టర్ కృష్ణమాచారి కూడా మాట్లాడారు. టీమిండియా నలుగురు స్పిన్నర్లతో ప్రయోగం చేస్తే తప్పేటంని ప్రశ్నించాడు. 1970, 80 దశకాల్లో భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు ఆడిన సందర్భాలను గుర్తు చేశారు. స్పిన్‌ ప్రభావం ఉండే పిచ్‌లపై ఎక్కువగా వారితో బౌలింగ్ చేస్తేనే ఫలితాలు వస్తాయని కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. నలుగురు స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్‌తో పాటు స్టార్‌ పేసర్ బుమ్రాతో టీమిండియా రెండో టెస్టు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయంటూ చెబుతున్నారు.

ఇక రెండో టెస్టులో టీమిండియా బ్యాటింగ్ విభాగంలో కూడా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. టెస్టుల్లో పేలవ ప్రదర్శన ఇస్తోన్న శుభ్‌మన్‌ గిల్‌ను పక్కకు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అతని స్థానంలో రజత్ పాటిదార్‌ను తుది జట్టులోకి తీసుకుంటారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్ స్తానంలో సర్ఫరాజ్ ఖాన్ తుది జట్టులోకి వచ్చే చాన్సెస్‌ ఉన్నాయి.

రెండో టెస్టు టీమిండియా (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), జైస్వాల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అశ్విన్, బుమ్రా, కుల్దీప్ యాదవ్.

Next Story