ఎన్నిసార్లు కిందపడ్డా మళ్లీ దూసుకురావడం ముఖ్యం: సంజూ శాంసన్

టీమిండియా ప్రస్తుతం సౌతాఫ్రికా టూర్‌లో ఉంది.

By Srikanth Gundamalla  Published on  22 Dec 2023 8:04 AM GMT
team india, cricket, sanju samson, century ,

ఎన్నిసార్లు కిందపడ్డా మళ్లీ దూసుకురావడం ముఖ్యం: సంజూ శాంసన్

టీమిండియా ప్రస్తుతం సౌతాఫ్రికా టూర్‌లో ఉంది. ఈ టూర్‌లో భాగంగా టీ20 సిరీస్‌, వన్డే సిరీస్‌లు పూర్తయ్యాయి. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అవ్వగా.. మరో రెండు మ్యాచుల్లో చెరో మ్యాచ్‌ల గెలిచాయి ఇండియా, సౌతాఫ్రికా. దాంతో.. టీ20 సిరీస్‌ సమం అయ్యింది. ఇక మూడే వన్డేల సిరీస్‌ను మాత్రం టీమిండియా దక్కించుకుంది. మూడు వన్డేల్లో మొదటి, మూడో మ్యాచుల్లో గెలిచి కప్‌ను సొంతం చేసుకుంది. చివరి వన్డేలో సంజూ శాంసన్ అద్భుతంగా రాణించాడు. ఇక బౌలింగ్‌లో అర్షదీప్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ముఖ్యంగా సంజూ శాంసన్‌ ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కష్టకాలంలో ఉన్నా.. మెల్లిగా అన్నీ చూసుకుంటూ ఆడుతూ సెంచరీని చేశారు. సుదీర్ఘ అనుభవం, ప్రతిభ, మెరుగైన సగటురేటు ఉన్నా..ఇప్పటి వరకు సంజూకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. అయితే.. అంతకుముందు వచ్చిన అవకాశాల్లో అంతగా రాణించలేకపోవడమే కారణం. కానీ.. ఈసారి వచ్చిన అవకాశాన్ని మాత్రం ఏమాత్రం వదులుకోలేదు. తాను ఆడిన వన్డే మ్యాచ్‌లో ఏకంగా సెంచరీ బాదాడు. అంతేకాదు.. మూడో స్థానంలో వచ్చి దాదాపు చివరి వరకు నిలబడ్డాడు. వచ్చినవారు వచ్చినట్లు పెవిలియన్‌కు వెళ్తున్నా.. సంజూ మాత్రం నిలకడగా ఆడి జట్టును ఆదుకున్నాడు. మరోవైపు తిలక్‌ వర్మ అర్థశతకం చేసి.. తనవంతు పాత్ర పోషించాడు.

ఈ సందర్బంగా మాట్లాడిన సంజూ శాంసన్ గత మూడు, నాలుగు నెలలుగా మానసికంగా ఎంతో బాధపడ్డానని చెప్పాడు. కష్టమైన పరిస్థితుల నుంచి బయటపడి వన్డేల్లో సెంచరీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు. టీమిండియా గెలుపులో కీలక పాత్రుడిని అయినందుకు గర్వంగా ఉందని చెప్పాడు సంజూ శాంసన్. అయితే.. తన నాన్న ఒక స్పోర్ట్స్‌ మేన్‌ అని గుర్తు చేశాడు. ఎన్నిసార్లు కిందపడ్డా.. మళ్లీ అంతకంటే బలంగా దూసుకురావడం ముఖ్యమని సంజూ శాంసన్ చెప్పాడు. మూడో వన్డేలో అస్సలు స్కోర్‌ కార్డు చూడలేదనీ.. తిలక్‌ వర్మతో మంచి భాగస్వామ్యం నెలకొల్పాలని అనుకున్నానని అన్నాడు. ఈ క్రమంలోనే సెంచరీ చేశాను అని చెప్పాడు సంజూ శాంసన్. వన్డేల్లో మూడంకెల స్కోర్‌ కోసం 8 ఏళ్లుగా నిరీక్షించాడు సంజూ శాంసన్. ఎట్టకేలకు సౌతాఫ్రికా సిరీస్‌లో ఆ మార్క్‌ను చేరుకోవడంతో అతడి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story