కోహ్లి చెప్పినా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పట్టించుకోలేదా..?

Team India Captain Virat Kohli. టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య ఐదో టెస్టు నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  11 Sep 2021 2:21 PM GMT
కోహ్లి చెప్పినా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పట్టించుకోలేదా..?

టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య ఐదో టెస్టు నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే..! బయో బబుల్‌ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల భారత బృందానికి కరోనా సోకిందని పలువురు విమర్శలు గుప్పించారు. ఇటీవల బుక్‌లాంచ్‌ చేసిన టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రికి కరోనా సోకడంతో.. ఆయన బాధ్యతారాహిత్యం వల్లే ఐదో టెస్ట్ మ్యాచ్ ఆగిపోయిందని అంటున్నారు.

ఐదో టెస్టును నిరవధికంగా వాయిదా వేసిన క్రమంలోవేసే ముందు భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మ్యాచ్ ను ఎలాగైనా నిర్వహించాలని కోరినట్లు తెలుస్తోంది. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ నేపథ్యంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఇరు జట్లకు కీలకం.. ఇక టీమిండియా సెకండ్‌ ఫిజియో యోగేశ్‌ పర్మార్‌కు పాజిటివ్‌గా తేలడంతో మ్యాచ్‌ నిర్వహణ కుదరదని భావించారు. ఆటగాళ్లందరికీ పరీక్షలు నెగటివ్‌ వచ్చినప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్‌ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఈసీబీ ఆ తర్వాత నిరవధికంగా వాయిదా వేసినట్లు వెల్లడించింది.

రెండు రోజుల తర్వాత మ్యాచ్‌ను నిర్వహించాల్సిందిగా కోహ్లి ప్రతిపాదించినట్లు సమాచారం. హెడ్‌ కోచ్‌తో పాటు కీలక అడ్వైజర్లు అందుబాటులో లేకపోవడం, ఫిజియోథెరపిస్టు కూడా కరోనా బారిన పడటంతో రెండు లేదా మూడు రోజుల అనంతరం మ్యాచ్‌ ఆడించాలని కోరగా.. ఈసీబీ అందుకు ఒప్పుకోలేదనే ప్రచారం సాగుతోంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఈనెల 22న ఇంగ్లండ్‌ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరిగి ఎప్పుడు మ్యాచ్‌ నిర్వహించాలన్న అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.


Next Story