ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. దీంతో ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుని పతక వేటలో మరింత ముందుకు వెళ్లింది. మంగళవారం జరిగిన గ్రూపు-ఏ మూడో మ్యాచ్‌లో స్పెయిన్‌ను తో తలపడిన భారత్.. ఆ జట్టును 3-0 తేడాతో మట్టికరిపించింది. చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 1-7 తేడాతో ఘోర పరాజయం పొందిన భారత జట్టు.. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి పుంజుకుంది.
కెప్టెన్ మన్దీప్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు ఈ మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి క్వార్టర్‌లోనే రెండు గోల్స్ చేసి ప్రత్యర్ధిపై ఒత్తిడి పెంచింది. మ్యాచ్ 14వ నిమిషంలో సిమ్రన్‌జిత్ సింగ్ తొలి గోల్ చేయగా.. రూపిందర్ పాల్ రెండు గోల్స్ చేశాడు. రెండింట్లో మొదటి గోల్ 15వ నిమిషంలో చేయగా.. రెండోది 51వ నిమిషంలో చేశాడు. రూపిందర్ పాల్ రాణించడంతో భారత్ మరింత ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రత్యర్థి స్పెయిన్.. భారత్‌కు ఏ దశలోనూ పోటీని ఇవ్వలేకపోయింది. దీంతో భారత జట్టు 3-0 తేడాతో ఘన విజయం సాధించింది.