ఐపీఎల్ ఒక వారం పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటన

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 నిలిపివేశారు.

By Medi Samrat
Published on : 9 May 2025 2:15 PM IST

ఐపీఎల్ ఒక వారం పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటన

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 నిలిపివేశారు. జమ్మూ, పఠాన్‌కోట్ సమీప ప్రాంతాలలో వైమానిక దాడుల హెచ్చరికల కారణంగా ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ను రద్దు చేశారు. ఇక టాటా ఐపీఎల్ 2025ను తక్షణమే వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధికారిక ప్రకటన చేసింది. దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఐపీఎల్ పాలకమండలి అన్ని కీలక భాగస్వాములతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నారు. చాలా ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల ఆందోళనలను, మనోభావాలను తెలియజేశాయని, అలాగే ప్రసారదారులు, స్పాన్సర్లు, అభిమానుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని వివరించారు. పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసిన తర్వాత, సంబంధిత అధికారులు, భాగస్వాములతో చర్చించి టోర్నమెంట్ కొత్త షెడ్యూల్, వేదికల వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. భారత ప్రభుత్వానికి, సాయుధ దళాలకు, దేశ ప్రజలకు బీసీసీఐ తమ సంఘీభావాన్ని ప్రకటించింది.

Next Story