T20 World Cup: ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌ను టీమిండియా అభిమానులు ఎవరూ మర్చిపోలేరు.
By Srikanth Gundamalla Published on 25 Jun 2024 6:58 AM ISTT20 World Cup: ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌ను టీమిండియా అభిమానులు ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే భారత్ వేదికగా ఆ టోర్నీ జరగడం.. మరోవైపు ఒక్క అపజయం లేకుండా ఫైనల్‌కు వచ్చిన టీమిండియాను ఆస్ట్రేలియా జట్టు ఓడించింది. వన్డే వరల్డ్ కప్‌ను ఎగరేసుకు పోయింది. అప్పుడు దేశం మొత్తం ఒకింత బాధపడింది. అయితే.. అదే ఆస్రేలియా టీమ్‌పై టీ20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. సూపర్-8 మ్యాచులో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ తలపడింది. విండీస్‌లోని సెయింట్ లూసియా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 24 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో.. ఆసీస్ సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసింది. గ్రూప్-1లో భారత్ మొదటి స్థానంలో నిలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇక బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో అప్ఘాన్ గెలిస్తే.. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించనుంది.
తొలుత ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా బాదడమే పనిగా పెట్టుకున్నాడు. వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 41 బంతుల్లో 92 పరుగులు చేశాడు. సెంచరీని జస్ట్ చేజార్చుకున్నాడు. రోహిత్‌కి మంచి ఆరంభాన్ని ఇవ్వడంతో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది. మిగతా బ్యాటర్లు కూడా తమ వంతుగా స్కోరును బాదారు. ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే డకౌట్‌గా వెనుదిరిగాడు. సూర్య కుమార్ యాదవ్ 16 బంతుల్లో 31 పరుగులు, శివమ్ దూబె 22 బంతుల్లో 28 పరుగులు, హార్దిక్ పాండ్యా 17 బంతుల్లో 27 పరుగులు కొట్టారు.
ఇక 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కూడా ధాటిగా బ్యాటింగ్‌ను మొదలుపెట్టింది. డేవిడ్ వార్నర్ 6 పరుగులు చేసి త్వరగా ఔట్ అయినా మిగతా బ్యాటర్లు రాణించారు. ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌ను దెబ్బకొట్టిన ట్రావిస్ హెడ్ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ను ఆడాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ కూడా తోడవడంతో ఒకానొక సమయంలో వారి చేజింగ్ ఈజీ అయిపోయిందనుకున్నారు. కీలక సమయంలో మార్ష్ వికెట్‌ను కుల్దీప్ పడగొట్టాడు. దాంతో మ్యాచ్‌ను గాడిలోకి తెచ్చాడు. కానీ ఒక వైపు హెడ్ మాత్రం తన బాదుడిని ఆపలేదు. 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. చివరకు బుమ్రా వేసిన ఒక స్లో డెలవరీకి హెడ్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 43 బంతుల్లో 76 పరుగులు చేశాడు ట్రావిస్ హెడ్. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా వరుసగా పెవిలియన్‌కు చేరారు. దాంతో.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 181 పరుగులకు ఆసీస్ పరిమితం అయ్యింది.
ఇక గ్రూప్-1 లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. సెమీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది భారత్. మంగళవారం జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను అప్ఘాన్ ఓడిస్తే..ఈ టీమ్ కూడా సెమీస్ చేరనుంది. అప్పుడు ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించనుంది.