టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ ఆడనున్న టీమ్ ఇదే..! ఓపెనర్లుగా రోహిత్, కోహ్లి?
టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం అయ్యింది. అమెరికా, వెస్టిండీస్‌లో ఈ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 11:28 AM ISTటీ20 వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ ఆడనున్న టీమ్ ఇదే..! ఓపెనర్లుగా రోహిత్, కోహ్లి?
టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం అయ్యింది. అమెరికా, వెస్టిండీస్‌లో ఈ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు పెద్ద జట్లేవి తలపడలేదు. ముఖ్యంగా టీమిండియా టోర్నీ ప్రారంభం అయిన 4 రోజుల తర్వాత తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 5వ తేదీన ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది. టోర్నీకి ముందు జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్ ఆడింది భారత్. ఈ మ్యాచ్‌లో ఆ టీమ్‌ను చిత్తు చేసింది. 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే.. ఆ మ్యాచ్‌లో కోహ్లీ, జైస్వాల్ బెంచ్‌కే పరిమితం అయ్యారు. మరి తొలి మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరుంటారనేది ఆసక్తిగా మారింది.
టీ20 వరల్డ్ కప్ భారత్ తొలి మ్యాచ్ జట్టుపై క్రీడా నిపుణుల నుంచి అంచనాలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఓపెనర్‌గా దిగాడు. అయితే.. అందులో అతను రాణించలేదు. శాంసన్ మినహా ఇతర బ్యాటర్లంతా మంచి స్కోర్‌నే చేశారు. కానీ.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, జైస్వాల్ మాత్రం దూరంగా ఉన్నారు. తాజాగా బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ తుది జట్టుపై ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. వార్మప్ మ్యాచులో జైశ్వాల్‌ను బెంచ్‌పై కూర్చోబెట్టడం దానికి సంకేతమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఓపెనర్‌గా వచ్చిన అవకాశాన్ని శాంసన్ వినియోగించుకోలేకపోయాడు. పైగా ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారించాడు. దీంతో రోహిత్‌తో కలిసి అతడే ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
యాక్సిడెంట్ తర్వాత చాలా కాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు రిషబ్ పంత్. కానీ.. చివరి ఐపీఎల్ సీజన్‌లోనే రీఎంట్రీ ఇచ్చి అద్భుత ప్రదర్శనను కనబర్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా కూడా రాణించాడు. ఈ క్రమంలోనే సంజూ శాంసన్‌కు బదులు పంత్‌నే తుది జట్టులో ఆడించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్పెషలిస్ట్ బ్యాటర్ అవసరం ఉందనుకుంటే సంజూకి అవకాశం దక్కకపోవచ్చని సమాచారం.
పంత్‌ను వన్ డౌన్‌లో దింపి.. టీ20 నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను నాలుగో స్థానంలో ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్‌రౌండర్ల కోటాలో ఉన్న శివమ్ దూబె, పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌కు జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. వీరితో బ్యాటింగ్, బౌలింగ్ డెప్త్ పెరుగుతుందని టీమిండియా ఆలోచిస్తోంది. స్పెషలిస్టు స్పిన్నర్‌గా కుల్‌దీప్ యాదవ్, పేసర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్‌లకు జట్టులో చోటు దక్కడం ఖాయమే.
ఐర్లాండ్ తో టీ20 మ్యాచ్‌కు భారత జట్టు అంచనా:
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్