యాక్షన్ తీసుకోవాల్సిందే.. అభిమానులు వదిలిపెట్టేలా లేరు
టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8 కు చేరుకోవడంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు విఫలమైంది.
By M.S.R Published on 15 Jun 2024 9:45 PM ISTయాక్షన్ తీసుకోవాల్సిందే.. అభిమానులు వదిలిపెట్టేలా లేరు
టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8 కు చేరుకోవడంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు విఫలమైంది. పాకిస్థానీ జట్టు ప్రదర్శన సరిగ్గా లేదని.. మొత్తం జట్టుపై, సెలెక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆధ్వర్యంలో క్రికెట్ సెటప్‌ను పూర్తిగా మార్చాలని పాక్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అమెరికా చేతిలో సూపర్ ఓవర్ లో పాక్ ఓటమి తరువాత భారత్‌పై ఘోర పరాజయం పాక్ జట్టుకు ఇబ్బందిగా మారింది. USA ఐర్లాండ్‌తో ఓడిపోయి ఉంటే పాకిస్థాన్ రెండవ రౌండ్‌లోకి ప్రవేశించడానికి అవకాశం ఉండేది. కానీ వర్షం అడ్డంకి ఏర్పడి, USA వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ రద్దు అయింది. పాకిస్థాన్ ఆశలను దెబ్బతీసింది.
టీ20 ప్రపంచకప్ నుంచి జట్టు నిష్క్రమించడం పాక్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. “ఈ ఆటగాళ్లందరినీ తొలగించాలి. ఆటగాళ్లు, టీమ్ సెలక్టర్లు, కోచ్‌లు.. వీళ్లందరినీ తప్పించి, వారి స్థానంలో కొత్త వ్యవస్థను తీసుకురావాలి” అని పాక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీ20 వరల్డ్‌కప్ నుంచి పాకిస్థాన్ జట్టు ముందుగానే నిష్క్రమించడం క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. ఆటగాళ్ల ప్రదర్శన సరిగా లేదని.. కెప్టెన్ బాబర్ ఆజం నాయకత్వంలో లోపాలు ఉన్నాయని.. ఈ విషయాన్ని సెలెక్టర్లు పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. జట్టులో ఉన్న యువకులకు సరైన అవకాశం లభించలేదని అభిమానులు ఆరోపిస్తున్నారు.
PCB జట్టు పనితీరుపై సమగ్ర పరిశీలన, సమీక్ష కోసం సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవచ్చని అంటున్నారు. కెప్టెన్ బాబర్ అజామ్, ఇతర సీనియర్ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్‌లను రద్దు చేసే అవకాశం ఉందని, జట్టులో పెద్ద మార్పు తీసుకుని రావాల్సిన అవసరముందని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చెప్పారు.