పోరుకు రంగం సిద్ధం.. ఓడితే కన్నీళ్లతో బరువెక్కే హృదయాలు.. ఆగ్రహాంతో బద్దలయ్యే టీవీలు
T20 World Cup 2021 India vs Pakistan match today.టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా నేడు చిరకాల
By తోట వంశీ కుమార్ Published on 24 Oct 2021 4:34 AM GMTటీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ లు తలపడనున్నాయి. రెండు దేశాల అభిమానులే కాకుండా యావత్తు క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓడితే కన్నీళ్లతో బరువెక్కే హృదయాలు.. ఆగ్రహాంతో బద్దలయ్యే టీవీలు.. ఊపిరి ఆగిపోయే సందర్భాలు ఇలా ఎన్నో భావోద్వేగాలు ఈ మ్యాచ్‌తో ముడి పడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు.. దేశమంతా పండుగలా మారి సంబురాలు చేసుకుంటారంటే.. ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ ఎంటో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియానే ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుందనడంలో సందేహాం లేదు. ఇప్పటి వరకు వన్డే, టీ 20 ప్రపంచ కప్‌లలో ఇరు జట్లు 12సార్లు తలపడగా.. అన్ని మ్యాచులలో భారత జట్టే జతకేతనం ఎగురవేసింది. టీ 20 ప్రపంచకప్‌లో ఐదు సార్లు తలపడగా.. భారత జట్టే విజేతగా నిలిచింది. దీంతో మరోసారి పాక్‌ను మట్టికరిపించి టీ20 ప్రపంచకప్‌లో శుభారంభం చేయాలని భారత జట్టు బావిస్తోంది. యూఏఈలోనే ప్రపంచకప్ జరుగుతుండడం భారత జట్టుకు కాస్త కలిసివచ్చే అంశం. ఇక్కడ ఐపీఎల్ 14వ రెండో సీజన్ జరగడంతో భారత ఆటగాళ్లకు పరిస్థితులు.. మైదానాలపై కాస్త అవగాహాన ఉంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఇక పాక్‌పై కెప్టెన్ కోహ్లీ రికార్డు చాలా అద్భుతంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి. రిషబ్‌పంత్, హార్థిక్ పాండ్య చివర్లో మెరుపులు మెరిపించేందుకు సిద్దంగా ఉన్నారు. ఆల్‌రౌండర్‌గా జడేజా విలువైన పాత్ర పోషించగలడు. బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది.
ఇక పాక్ విషయానికి వస్తే.. ఆ దేశంలో మ్యాచ్‌లు రద్దు అయినప్పటి నుంచి యూఏఈ వేదికగానే మ్యాచ్‌లు ఆడుతోంది. యూఏఈని తమ స్వంత దేశంగా బావిస్తోంది. యూఏఈ పరిస్థితులు, మైదానాల్లోని పిచ్‌లు ఎలా స్పందిస్తాయని పాక్ ఆటగాళ్లకు తెలిసినంతగా భారత ఆటగాళ్లకు తెలియదనే చెప్పాలి. ఇక మ్యాచ్‌కు ముందు రోజే 12 మందితో కూడిన జట్టను పాక్ ప్రకటించింది. కెప్టెన్ బాబర్ ఆజమ్, రిజ్వాన్‌ల బ్యాటింగ్‌పైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. షాహిన్ షా అఫ్రిది, హసన్ అలీ, హారిస్ రవూఫ్‌లతో కూడిన పేస్ త్రయంతో పాక్ బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉంది. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.
పిచ్..
ఈ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానంగా సహకరిస్తుంది. ఒక్కసారి కుదురుకుంటే పరుగులు చేయడం పెద్ద కష్టం కాదు. మంచు ప్రభావం చూపే అవకాశం ఉండడంతో.. టాస్ గెలిచిన జట్టు చేధనకే మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఇక భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.