ప్రయోగాలకు స్వస్తి.. ఇంగ్లాండ్‌తో భారత్‌ తొలి టి20 నేడే

T20 Series Starts From today between India vs England.టెస్టు స‌మ‌రం ముగిసింది. ఇక పొట్టి పోరు మొదలుకానుంది. మూడు టి20

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 July 2022 1:35 PM IST
ప్రయోగాలకు స్వస్తి.. ఇంగ్లాండ్‌తో భారత్‌ తొలి టి20 నేడే

టెస్టు స‌మ‌రం ముగిసింది. ఇక పొట్టి పోరు మొదలుకానుంది. మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు భార‌త్, ఇంగ్లాండ్‌లు తొలి టి20లో త‌ల‌ప‌డ‌నున్నాయి. టి20 ప్ర‌పంచ క‌ప్ స‌మీపిస్తుండ‌డంతో ప్రయోగాల‌ను ప‌క్క‌న పెట్టి మెగా టోర్నీకి అత్యుత్త‌మ ఎలెవ‌న్‌ను గుర్తించ‌డ‌మే ల‌క్ష్యంగా టీమ్ఇండియా బ‌రిలోకి దిగుతోంది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా టెస్టు మ్యాచ్‌కు దూర‌మైన కెప్టెన్‌, హిట్‌మ్యాన్ జ‌ట్టులోకి రాగా.. టెస్టు జట్టులో సభ్యులుగా ఉన్న ఐదుగురు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా, రిషభ్‌ పంత్, శ్రేయస్‌ అయ్యర్ లు రెండో మ్యాచ్‌ నుంచి టీమ్‌తో కలుస్తారు.

ఐర్లాండ్‌తో సిరీస్‌లో అదరగొట్టిన దీపక్‌ హుడాకు తుది జ‌ట్టులో చోటు ఇచ్చే విష‌య‌మై మేనేజ్‌మెంట్ నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. రోహిత్‌తో క‌లిసి ఇషాన్ కిష‌న్ ఓపెనింగ్ చేసే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ దీప‌క్ హుడా జ‌ట్టులో ఉంటే సూర్యకుమార్‌, దీపక్‌ హుడా, హార్దిక్‌ పాండ్యా, దినేశ్‌ కార్తీక్ ల‌తో కూడిన మిడిలార్డర్‌ పటిష్ఠంగా క‌నిపిస్తోంది. బౌలింగ్‌ విషయానికొస్తే భువనేశ్వర్‌తో పాటు హర్షల్‌ పటేల్‌, అవేశ్‌ఖాన్‌ తుది జట్టులో బెర్తు దక్కవచ్చు. చాహ‌ల్‌, అక్ష‌ర్ ప‌టేల్ స్పిన్ బాధ్య‌త‌ల‌ను పంచుకుంటారు. ఇక అరంగేట్రం చేయ‌ని రాహుల్ త్రిపాఠి, అర్ష‌దీప్ సింగ్‌లు రెండు, మూడో టీ20ల‌కి జ‌ట్టులో లేరు ఈ మ్యాచ్‌లో ఉన్నా తుది జ‌ట్టులో అవ‌కాశం రావ‌డం క‌ష్ట‌మే.

మోర్గాన్‌ నుంచి కెప్టెన్సీ అందుకున్నబట్లర్‌ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న ఇంగ్లిష్‌ జట్టు ఇరగదీయాలన్న పట్టుదలతో ఉంది. బెన్‌స్టోక్స్‌, బెయిర్ స్టోల‌కు ఈ సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చినా.. జ‌ట్టులో హిట్ట‌ర్ల‌కు కొద‌వ‌లేదు. కొత్త కెప్టెన్‌ బట్లర్‌తో పాటు డేవిడ్‌ మలాన్, లివింగ్‌స్టోన్, జేసన్‌ రాయ్, సాల్ట్‌లు ఒంటి చేత్తో మ్యాచ్‌ను మ‌లుపుతిప్ప‌గ‌ల ఆట‌గాళ్లే. వీళ్ల‌కు తోడు జోర్డాన్, మొయిన్‌ అలీ రూపంలో ఇద్ద‌రు నాణ్య‌మైన ఆల్‌రౌండ‌ర్లు ఇంగ్లాండ్ సొంతం. వీరిని నిల‌వ‌రించ‌డం భార‌త బౌల‌ర్ల‌కు పెను స‌వాలే.

ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్లు 19 టి20 మ్యాచుల్లో త‌ల‌ప‌డ‌గా.. ఇందులో భార‌త్ 10 మ్యాచుల్లో, ఇంగ్లాండ్ 9 మ్యాచుల్లో విజ‌యం సాధించాయి. ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్ జ‌ట్టుతో 6 మ్యాచుల‌ను ఆడ‌గా కేవ‌లం రెండు మ్యాచుల్లోనే టీమ్ఇండియా విజ‌యం సాధించింది.

Next Story