టీ20ల్లో అత్యుత్త‌మ గ‌ణాంకాలు.. 7 వికెట్లు తీసి చ‌రిత్ర సృష్టించిన బౌల‌ర్‌..!

Syazrul Idrus becomes the first man to take a seven-for in T20Is. టీ20 ప్రపంచకప్‌ బి క్వాలిఫయర్‌ తొలి మ్యాచ్‌ మలేషియా-చైనాల మధ్య కౌలాలంపూర్‌లో జరిగింది.

By Medi Samrat  Published on  26 July 2023 2:50 PM IST
టీ20ల్లో అత్యుత్త‌మ గ‌ణాంకాలు.. 7 వికెట్లు తీసి చ‌రిత్ర సృష్టించిన బౌల‌ర్‌..!

టీ20 ప్రపంచకప్‌ బి క్వాలిఫయర్‌ తొలి మ్యాచ్‌ మలేషియా-చైనాల మధ్య కౌలాలంపూర్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో మలేషియా ఫాస్ట్ బౌలర్ శ్యాజ్రుల్ ఇద్రుస్‌ 7 వికెట్లు తీసి టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 7 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా శ్యాజ్రుల్ ఇద్రుస్‌ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చైనా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చైనా నిర్ణీత 20 ఓవర్లలో 23 పరుగులకు ఆలౌటైంది. మలేషియా తరఫున ఇద్రుస్‌ 7 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు.

7 వికెట్లు తీసిన ఇద్రుస్ అంద‌రి బ్యాట్స్‌మెన్‌లను బౌల్డ్ చేయ‌డం విశేషం. త‌ద్వారా ఇద్రుస్ టీ20 క్రికెట్‌లో పీటర్ అహో పేరిట ఉన్న‌ రికార్డును బద్దలు కొట్టాడు. పీటర్ అహో 2021 సంవత్సరంలో సియెర్రా లియోన్‌పై 5 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. అంతకుముందు ఈ రికార్డు టీమిండియా దీపక్ చాహర్ పేరిట ఉండేది. అచాహర్ 2019 సంవత్సరంలో బంగ్లాదేశ్‌పై 7 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.

నిజానికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చైనా 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసినా.. ఇద్రుస్ తొలి వికెట్ తీయడంతో ఆ తర్వాత చైనా జట్టు వికెట్ల పతనం మొదలైంది. ఇద్రుస్ తన రెండో ఓవర్ తొలి బంతికి 3 పరుగుల వద్ద వాంగ్ లియుయాంగ్‌ను బౌల్డ్ చేశాడు. అదే ఓవర్‌లో మరో మూడు వికెట్లు పడగొట్టాడు. తర్వాతి ఓవర్‌లో రెండు వికెట్లు, చివ‌రిదైన నాలుగో ఓవ‌ర్‌లో ఒక వికెట్ తీశాడు.

ఇద్రుస్ ధాటికి చైనా 11.2 ఓవ‌ర్ల‌లో 23 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఛేద‌న‌కు దిగిన‌ మలేషియా జట్టు ఆరంభం కూడా పేలవంగానే సాగింది. రెండు ఓవర్లకే మలేషియా రెండు వికెట్లు కోల్పోయింది. విరందీప్ సింగ్ 14 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 19 పరుగులు చేసి 4.5 ఓవర్లలో మలేషియాను విజయతీరాలకు చేర్చాడు.


Next Story