ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్య.. మూడో టీ20లో భారత్ ఘన విజయం
Suryakumar Yadav’s sizzling century helps India clinch the T20I series 2-1.నిర్ణయాత్మక పోరులో సూర్యకుమార్ యాదవ్
By తోట వంశీ కుమార్ Published on 8 Jan 2023 8:51 AM ISTనిర్ణయాత్మక పోరులో మిస్టర్ 360 డిగ్రీస్ సూర్యకుమార్ యాదవ్ విజృంభించాడు. తనదైన శైలిలో పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లను ప్రేక్షక పాత్రకు పరిమితం చేస్తూ అభిమానులను అలరిస్తూ రాజ్‌కోట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి టీ20ల్లో మూడో శతకాన్ని అందుకున్నాడు. సూర్య ధాటికి ప్రత్యర్థి ముందు టీమ్ఇండియా భారీ స్కోర్‌ను ఉంచగా బౌలర్ల కృషి తోడు కావడంతో మూడో టీ20లో విజయం సాధించిన భారత్.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే.. ఆదిలో టీమ్ఇండియాకు షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒక్క పరుగే చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో మూడు పరుగుల వద్దే టీమ్ఇండియా తొలి వికెట్‌ను కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి వచ్చి రావడంతో బౌలర్లపై ఎటాకింగ్‌కు దిగాడు. ఓ వైపు త్రిపాఠి ఎదురుదాడి చేస్తుంటే మరో వైపు మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(46; 36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డాడు. కరుణ రత్నె ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన త్రిపాఠి(35; 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అదే ఊపులో మరో షాట్ ఆడేందుకు యత్నించి పెవిలియన్‌కు చేరుకున్నాడు.
అయితే.. లంకకు పెద్దగా సంతోషించడానికి ఏమీ లేకుండా పోయింది. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ (112 నాటౌట్; 51 బంతుల్లో 7 పోర్లు, 9 సిక్సర్లు) వచ్చి రావడంతో విధ్వంసాన్ని మొదలు పెట్టాడు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి తరలించాడు. కేవలం 26 బంతుల్లో అర్థశతకం సాధించాడు. ఆ తరువాత మరింత రెచ్చిపోయాడు. మరో 19 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు అంటే అతడి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో గిల్‌తో మూడో వికెట్‌కు 111 పరుగులు జోడించాడు సూర్య.
గిల్ ఔటైన తరువాత వచ్చిన కెప్టెన్ హార్థిక్ పాండ్య(4), దీపక్ హుడా(4)లు విఫలం అయినా అక్షర్ పటేల్(21; 9 బంతుల్లో 4 ఫోర్లు) రాణించాడు. సూర్య విధ్వంసానికి అక్షర్ సహకారం తోడు కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమ్ఇండియా 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన లంక కు భారత బౌలర్లు చుక్కలు చూయించారు. అర్ష్‌దీప్ (3/20), ఉమ్రాన్ మాలిక్(2/31), హార్థిక్ (2/30), చాహల్(2/30) ధాటికి 16.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. సూర్యకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించగా, అక్షర్ పటేల్‌కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డు దక్కింది.