టీ20ల్లో నెంబర్ 1 బ్యాటర్ అయిన టీమ్ఇండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఎందుకనో వన్డేల్లో విఫలం అవుతున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో అతడి ఆట మరీ పేలవంగా ఉంది. ఈ మూడు మ్యాచుల్లో అతడు తొలి బంతికే ఔట్ అయ్యాడు. దీంతో ఇలా వరుసగా మూడు మ్యాచుల్లో గోల్డెన్ డక్(మొదటి బంతికే ఔట్) అయిన తొలి ఆటగాడిగా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
తొలి రెండు వన్డేల్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన సూర్య కీలకమైన మూడో మ్యాచ్‌లో అస్టన్ అగర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే నిరాశతో మైదానాన్ని వీడాడు.
ఓ వన్డే సిరీస్‌లో అన్ని మ్యాచుల్లో గోల్డెన్ డక్ అయిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా వన్డేల్లో వరుసగా మూడు సార్లు డకౌట్ అయిన ఆరో భారత ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కాడు. సూర్యకుమార్ యాదవ్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్, జస్‌ప్రీత్ బుమ్రాలు ఉన్నారు.
ఇక వన్డేల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ అగ్రస్థానంలో ఉన్నాడు. మలింగ వరుసగా నాలుగు సార్లు ఖాతా తెరవకుండానే ఔటైయ్యాడు.
మూడు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ వన్డే ఫార్మాట్‌కు పనికిరాడని, అతనికి బదులు సంజూ శాంసన్‌కు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సూర్యను టీ20లకే పరిమితం చేయాలని మండిపడుతున్నారు.